ఒలింపిక్స్‌కు ముందు చైనాలో మూడో నగరం లాక్‌డౌన్

 ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు బీజింగ్‌లో శీతాకాల ఒలింపిక్ క్రీడోత్సవాలు జరగనుండగా, చైనా లోని మూడో ప్రముఖ నగరమైన అన్యంగ్ కఠినమైన ఆంక్షలతో లాక్‌డౌన్ అమలు లోకి వెళ్లనుండడం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కట్టడి కోసం మొత్తం 20 మిలియన్ ప్రజలను ఇళ్లకే పరిమితం చేయనున్నారు. 
 
పర్యాటక కేంద్రమైన జియాన్, రేవు పట్టణం తియాన్‌జిన్, తరువాత సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్ లోని 5.5 మిలియన్ జనాభా కలిగిన నగరం అన్యంగ్. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 58 కరోనా కేసులు నమోదయ్యాయి. అన్యంగ్‌లో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని మున్సిపల్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
 
 ఇదిలా ఉండగా చైనా లోని వివిధ ప్రాంతాలతో కలిపి దాదాపు 200 కేసులు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం వెల్లడించింది. స్థానికంగా కొత్త కేసులు హెనన్‌లో 87,షాంక్సీలో 13, తియాన్‌జిన్‌లో 10 నమోదయ్యాయని , ఇంకా విదేశీయుల నుంచి వచ్చిన వారికి సంబంధించి 11 ప్రావిన్సియల్ స్థాయి రీజియన్లలో 82 కేసులు నమోదైనట్టు వివరించింది. 
 
మొత్తం 3458 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 21 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వేర్కొంది. అన్యంగ్ నగరంలో సూపర్ మార్కెట్లన్నీ మూతపడ్డాయి.
 
ఇలా ఉండగా, ఆఫ్రికా ఖండం లోని తూర్పు దేశం ఉగాండాలో రెండేళ్ల పాటు అమలులో ఉన్న లాక్‌డౌన్ ఇప్పుడు ముగియడంతో అక్కడి స్కూళ్లు మళ్లీ తెరుచుకున్నాయి. కరోనా  మహమ్మారి ప్రభావంతో 2020 మార్చి నుంచి 2022 జనవరి 10 వరకు దాదాపు రెండేళ్ల సుదీర్ఘకాలంగా లాక్‌డౌన్ కొనసాగింది. 
 
ఇప్పుడు ముగియడంతో ఉగాండా రాజధాని కంపాలా లోని పలు ప్రాంతాల్లో స్కూళ్ల పిల్లలు బ్యాగులు మోసుకుంటూ స్కూళ్లకు వెళ్లడం కనిపించింది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
 
అమెరికాలో ఒకేరోజు 13.5 లక్షల కేసులు 

అమెరికాలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడమే తప్ప తగ్గుదల కనిపించడం లేదు.  ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా 13 లక్షల 50 వేల కేసులు నమోదయ్యాయి.

శని, ఆదివారాల్లో రాష్ట్రాలేవీ కేసులు రికార్డు చేయని కారణంగా సోమవారం నాటికి  తారాస్థాయికి కేసులు చేరుకుంటున్నాయి. గత 3 వారాల్లో ఆస్పత్రులో చేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. వర్జీనియా, టెక్సాస్, కెంటకీ, కన్సాస్, చికాగోలలో వైద్యుల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.