పీఆర్‌సీ ప్రకంపనాలు… గ్రామ, వార్డు కార్యదర్శుల బిగ్‌షాక్‌

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన వేతన సవరణ పట్ల మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా,  తీవ్ర  అసంతృప్తికి గురయిన  గ్రామ, వార్డ్ కార్యదర్శిలు ప్రభుత్వంకు పెద్ద షాక్ ఇచ్చారు. 
 
తమ సర్వీసు ప్రొబేషన్‌ను డిక్లేర్‌ చేసి జీతాలు నిర్ణయించకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లోని కార్యదర్శులు, ఇతర సిబ్బంది ఆగ్రహంగా ఉన్నారు. వెనువెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించారు. నిరసనగా వాట్సాప్‌ గ్రూపుల నుంచి  ఎగ్జిట్‌ కావడం ప్రారంభించారు. 
 
  ఈరోజు నుండి అన్ని అధికార సోషల్‌మీడియా గ్రూపుల నుండి వైదొలగారు. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను వేయకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపిడీవోలకు సమాచారమిచ్చారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని రేషన్‌ కార్డ్‌తోపాటు అనేక సంక్షేమ ఫలాలను వదులుకున్నామని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి అడ్మిన్‌గా ఉండే గ్రూపుల్లో నుంచి ఉద్యోగులు ఎగ్జిట్‌ అయ్యారు. గత ఏడాది ఆగస్టులో ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాల్సి ఉండగా నేటి వరకూ ప్రభుత్వం చేయలేదు. నిన్న సీఎం జగన్ పీఆర్‌సీ ప్రకటనలో జూన్‌ ఆఖరులో చేస్తామని చెప్పడంతో నిరసనకు దిగారు. 
 
గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ కావడంతో ప్రభుత్వ ఆదేశాలు ఎవరికి ఇవ్వాలో అర్ధంకాక అయోమయం చెందుతున్నారు. గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ అవుతున్న కార్యదర్శులతో వెంటనే మాట్లాడాలని జిల్లా అధికారులను స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ ఆదేశించారు.  వారికి నచ్చజెప్పాలని అధికారులకు అజయ్‌ జైన్‌ ఆదేశాలు జారీ చేశారు.
మాట వినకపోతే కఠిన చర్యలు ఉంటామని హెచ్చరించారు. జిల్లా అధికారులకు అజయ్‌ జైన్‌ వాట్సాప్‌ సందేశం పంపారు. కొత్త సంవత్సరంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వలే కొత్త జీతాలను తీసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. వెంటనే తమ ప్రొబేషన్‌ను డిక్లేర్‌ చేసి కొత్త జీతాలు ఇవ్వకుంటే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

 కాగా,రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఒక్క ఫిట్‌మెంట్‌ తప్ప మిగిలినవన్నీ బాగున్నాయని పేర్కొన్నారు. తాము ఊహించనవి కూడా సీఎం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశం అయి ధన్యవాదాలు తెలిపారు.