భద్రతా లోపంపై రాష్ట్రపతి తీవ్ర ఆందోళన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్‌లో బుధవారం పర్యటించిన సమయంలో జరిగిన భద్రతాపరమైన లోపాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రపతి భవన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రపతి  గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పంజాబ్‌లో బుధవారం జరిగిన భద్రతా లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు. 
 
ప్రధాన మంత్రి వాహన శ్రేణి ప్రయాణిస్తున్నపుడు జరిగిన సంఘటనల గురించి తెలుసుకున్నారు. భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భేటీలో పంజాబ్‌లో బుధవారం తన పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలపై ప్రధాని  వివరించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం అనంతరం మోదీ ట్విటర్ వేదికగా రామ్‌నాథ్ కోవింద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశాను. (భద్రతా లోపంపై) ఆందోళన వ్యక్తం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. నా శ్రేయస్సును ఆకాంక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఇటువంటి ఆకాంక్షలే ఎల్లప్పుడూ బలాన్నిస్తాయి’’ అని మోదీ ట్వీట్ చేశారు.

పంజాబ్ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి  ఫోన్ చేసిన ఆయన పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఆరా తీశారు. భద్రతా వైఫల్యానికి కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రధాని భద్రతా వైఫల్యంపై కఠిన నిర్ణయాలు 

ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం వ్యవహారాల శాఖ సమాచారం సేకరిస్తోందని, ఇందుకు బాధ్యులైన వారిపై భారీ, కఠిన నిర్ణయాలు ఉంటాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

కేంద్ర క్యాబినెట్ సమావేశం వివరాలను గురువారం పత్రికా విలేకరులకు వివరిస్తున్న సందర్భంగా ప్రధానికి జరిగిన భద్రతా వైఫల్యం అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా ఈ విషయమై ఇప్పటికే కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారని ఠాకూర్ తెలిపారు. 

తీసుకోవలసిన చర్యలపై హోం మంత్రిత్వశాఖ కూడా ఇప్పటికే మాట్లాడిందని, సమాచారం సేకరించిన తర్వాత భారీ, కఠినమైనవి ఎటువంటి నిర్ణయాలైనా హోం శాఖ తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇటువంటి తప్పులు జరిగితే దేశ న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు.