క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల్లో భారీగా జీఎస్‌టీ ఎగవేత

క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల్లో పెద్ద ఎత్తున వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేతను గుర్తించినట్లు వెల్లడించింది.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ), సీజీఎస్‌టీ అధికారులు నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.70 కోట్ల వరకు పన్ను ఎగవేతను గుర్తించినట్లు తెలిపింది. 

క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్ వజీర్ఎక్స్ పెద్ద ఎత్తున జీఎస్‌టీని ఎగవేసినట్లు ఇటీవల గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీజీఐ అధికారులు క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన సుమారు ఆరు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు జాతీయ మీడియా తెలిపింది. 

కాయిన్‌స్విచ్ కుబేర్, కాయిన్‌డీసీఎక్స్, బైయూకాయిన్, యూనోకాయిన్ లావాదేవీలను నిర్వహించే సంస్థలపై ఈ సోదాలు జరిగినట్లు తెలిపింది. క్రిప్టో కాయిన్స్ కొనుగోలు, అమ్మకాల్లో ఈ సంస్థలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయని, ఈ సేవలకు 18 శాతం జీఎస్‌టీని చెల్లించవలసి ఉందని, ఈ సంస్థలన్నీ ఈ పన్నును ఎగ్గొడుతున్నాయని పేర్కొంది. 

ఇదిలావుండగా, వజీర్ఎక్స్ సహా క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్లు జీఎస్‌టీ చట్టాలను ఉల్లంఘించినందుకు జరిమానా, జీఎస్‌టీ, వడ్డీల రూపంలో దాదాపు రూ.70 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.  బిట్‌కాయిన్, ఎథిరియం, రిపిల్ వంటి డిజిటల్ అసెట్స్‌తో వ్యాపారులు, వినియోగదారులు క్రిప్టో వాలెట్, ఎక్స్ఛేంజ్‌లలో లావాదేవీలను జరుపుతున్నారు.