12 వేలకు పైగా ఎన్జీఓల ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సులు రద్దు

విదేశాల నుండి వచ్చే నిధులపై ఆధారపడుతున్న 12 వేలకు పైగా స్వచ్ఛంద, ఇతర సంస్థలు ఫారన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సిఆర్‌ఎ) లైసెన్సులు కోల్పోయాయి. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది. మదర్‌ థెరిస్సా మిషనరీ ఆఫ్‌ ఛారిటీ లైసెన్సును పునరుద్ధరించడానికి నిరాకరించిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 
 
తాజా ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సులు రద్దైన జాబితాలో ఆక్స్‌ఫామ్‌ ఇండియా ట్రస్ట్‌, జామియా మిల్లియా ఇస్లామియా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, లెప్రపీ మిషన్స్‌, ట్యూబర్‌క్యులోసిస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌, ఇండియా ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్‌ తదితర సంస్థలు ఉన్నాయి.

సుమారు 12 వేల సంస్థలకు పైగా సంస్థలు తమ లైసెన్సులు పునరుద్ధరించడానికి దరఖాస్తు చేసుకోలేదని హోం శాఖ వర్గాలు తెలిపారు. శుక్రవారానికి గడువు తేదీ కాగా, అంతకంటే ముందే దరఖాస్తు చేసుకోవాలని అప్రమత్తం చేసినప్పటికీ  అవి ముందుకు రాలేదని, ఇప్పుడు పరిష్మన్‌ ఎలా ఇస్తారని అధికారులు ప్రశ్నించారు. 
 
విదేశీ నిధులు అందుకోవాలంటే సదరు ఎన్‌జిఒ సంస్థలు ఎఫ్‌సిఆర్‌ వద్ద రిజిస్టర్‌ అయి ఉండాలి. ఈ లెక్క ప్రకారం దేశంలో ఇప్పుడు ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సులు కల్గిన ఎన్‌జివో సంస్థలు 16,829 మాత్రమే ఉన్నాయి. కాగా, మొత్తం 22,762 ఎఫ్‌సిఆర్‌ఎ సంస్థలు రిజిస్టరై ఉన్నాయి.

ఇప్పటికే 6587 ఎన్జీఓలు జాబితాలో ఉన్నాయి.లైసెన్స్‌ల రెన్యువల్‌ కోసం గడువుకాలం పొడిగించినప్పటికీ ఆయా సంస్థలు అప్‌డేట్‌ చేసుకోలేదు. కొన్ని ఎన్జీఓల ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేన్‌కు తుది గడువు 2021 సెప్టెంబర్‌ 29,30 తేదీల్లో ముగియనుండగా, ఆ సమయాన్ని మార్చి 2022 వరకు హోం శాఖ పొడిగించింది.