అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లను నిరోధించాలి

ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు జరపకుండా నిరోధించాలని స్వదేశీ జాగరణ మంచ్‌ (ఎస్‌జెఎం)  డిమాండ్‌ చేసింది. ‘ భారత్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌-వాల్ట్‌మార్ట్‌లకు కార్యకలాపాలకు నిర్వహించేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోండి’ అన్న పేరుతో గ్వాలియర్ లో జరిగిన రెండు రోజుల జాతీయ మహాసథలలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
ఆ కంపెనీలకు ఇచ్చిన అన్ని అనుమతులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, అవి నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ చట్టవిరుద్ధమైనవని ప్రకటించాలని డిమాండ్‌ చేసింది.  ఈ సంస్థల కార్యకలాపాలపై సిబిఐతో విచారించాలని పేర్కొంది.
తన ఇకామర్స్ కార్యకలాపాలకు తోడు అమెజాన్ దేశంలోని చిన్న, పెద్ద రిటైల్ వ్యాపారాలను స్వాధీనం చేసుకొంటోందని, షాపర్స్ స్టాప్, మోర్ రిటైల్ చైన్‌లలోఆ సంస్థ పెట్టుబడులు పెట్టడం ఈ దిశగా తీసుకున్న చర్యలేనని కూడా స్వదేశీ జాగరణ్ మంచ్ ఆ తీర్మానంలో ఆరోపించింది.
 
2017 -18 నుండి 2019- 20 వరకు, మూడేళ్ల కాలంలో అమెజాన్ భారత్‌లో లీగల్, ప్రొఫెషనల్ ఫీజుల కింద రూ.9,788 కోట్లు ఖర్చు చేసిందని, దేశంలో అధికారులకు లంచం ఇచ్చేందుకు ఈ నిధులను ఈ ఖాతాలగుండా మళ్లించినట్లు ఆ సంస్థ అంతర్గత వర్గాలు బైటపెట్టాయని ఆ సంస్థ పేర్కొంది. 
 
అలాంటి ఇకామర్స్ సంస్థలు పొందిన లైసెన్సులు, అనుమతులన్నీ కూడా అక్రమ మార్గాలను ఉపయోగించి పొందినవేనని దీన్ని బట్టి రుజువవుతోందని పేర్కొంది. అందువల్ల తక్షణమే ఆ సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, వాటి కార్యకలాపాలన్నీ చట్ట విరుద్ధమైనవని ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తున్నామని స్వదేశీ జాగరణ్ మంచ్ ఆ తీర్మానంలో పేర్కొంది.
ఈ కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లాభం పొందుతున్న ఉన్నతాధికారులు, ప్రభుత్వాధికారులను సెలవులకు పంపి… ఈ విషయంపై స్వేచ్ఛాయుతంగా విచారణ చేపట్టాలని, నిందితులను శిక్షించాలంటూ పేర్కొంది. భారత్‌లోని అధికారులకు అమెజాన్‌ ముడుపులు చెల్లించిందంటూ ఆరోపించింది.
అమెజాన్‌ భారత్‌లో క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తుందని, విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ ఈ మధ్యనే జాతీయ హిందీ వార పత్రిక పాంచజన్య కవర్ పేజీ కధనాన్ని ప్రచురించింది.