గృహలకు 50 పైసలు విద్యుత్ భారం

తెలంగాణాలో విద్యుత్  ఛార్జీల పెంపుకు  సిద్దమైనది. ఆ మేరకు  ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ అథారిటీకి డిస్కంలు అందజేశాయి. గృహ వినియోగదారులకు 50 పైసలు (యూనిట్‌కు), వాణిజ్య వినియోగదారులకు (యూనిట్‌కు) రూపాయి చొప్పున పెంచాలని ప్రతిపాదించాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్  ఛార్జీలకు సంబంధించి డిస్కంలు ఈఆర్‌సికి టారిఫ్‌లను సమర్పించాయి. ఈ పెంపుదలతో రూ 6,831 కోట్లు అదనపు భారం వేయనున్నారు. 

ఈ సందర్భంగా సిఎండి రఘుమారెడ్డి మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ.10,928 కోట్ల ఆర్థిక లోటు పూడ్చడానికి విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్లు  తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి డిస్కంల ఆదాయ అవసరాలు రూ.53,054 కోట్లు ఉండగా, ఆదాయం రూ.42,126 కోట్లు కాగా, సబ్సిడీ పోనూ రూ.10,928 కోట్ల లోటును ఏర్పడుతుందని, దీనివల్ల చార్జీల పెంపు అనివార్యమని పేర్కొన్నారు.

ఎల్‌టి (డొమెస్టిక్) కనెక్షన్‌ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు వలన రూ.2,110 కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు.హెచ్‌టి కనెక్షన్‌లపై యూనిట్‌కు రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం లభిస్తుందన్నారు. చార్జీల పెంపుతో సుమారుగా రూ.6,831 కోట్ల అదనపు ఆదాయం డిస్కంలకు లభిస్తుందన్నారు.

రాష్ట్రంలో డోమెస్టిక్ వినియోగదారులు కోటి యాభై నాలుగు లక్షల మంది, కమర్షియల్ 13,27,494 మంది, ఎల్‌టి ఇండస్ట్రీయల్ వినియోగదారులు 66,519, ఎల్‌టి కాటేజీ 10,419 మంది, అగ్రికల్చర్ 25,78,000ల మంది రైతులు, హెచ్‌పి ఇండస్ట్రీయల్ 7,756 మంది, హెచ్‌పి కమర్షియల్ 4,509 మంది, హెచ్‌టి 13,715 మంది వినియోగదారులు ఉన్నారని డిస్కంల సిఎండిలు తెలిపారు. 

కాగా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, దీనిని ప్రస్తుతం అలాగే కొనసాగిస్తామని దీనివల్ల 25 లక్షల 78 వేల మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం 2014- నుంచి 2021 సంవత్సరం వరకు రూ. 25,467 కోట్ల సబ్సిడీని భరించిందని తెలిపారు.