యుపి ఎన్నికలపై వచ్చేవారం నిర్ణయం 

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై వచ్చేవారంలో ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోనుంది. ఎనిుకల ప్రధాన కమిషనర్‌ (సిఇసి) సుశీల్‌ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా నేపధ్యంలో రానున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను వాయిదా వేయాలని అలహాబాద్‌ హైకోర్టు విజ్ఞప్తి చేసిన ఒక్కరోజులోనే వచ్చేవారంలో రాష్ట్రంలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తామని సిఇసి చెప్పడం విశేషం. 
 
ఉత్తరాఖండ్‌ ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లు సమీక్షించడం కోసం సుశీల్‌ చంద్ర ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. డెహ్రాడూన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో వచ్చేవారంలో పర్యటించనున్నట్లు చెప్పారు.
 
అలహాబాద్‌ హైకోర్టు విజ్ఞప్తి గురించి విలేకరులు ప్రశ్నించగా, కరోనా  రక్షణ చర్యలు, రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకుంటూనే ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు.  వచ్చే ఏడాది ప్రారంభంలో యుపి, ఉత్తరాఖండ్‌, గోవా, పంజాబ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌, గోవాల్లో ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ పర్యటించింది.
 
ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రెండు, మూడు నెలలపాటు ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేయాలని హై కోర్ట్ న్యాయమూర్హ్టి ఎన్నికల కమీషన్ కు సూచించారు. అదే విధంగా ప్రస్తుత సమావేశంలో బహిరంగసభలు, రైలీలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు ఉంటె ప్రచారాన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసుకోవచ్చని చెప్పారు.