ఆధార్, ఓటరు ఐడి అనుసంధానం బిల్లుకు ఆమోదం

బోగస్ ఓట్లను నిరోధించడం కోసం ఆధార్‌తో ఓటర్ల జాబితా డేటాను అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. లోక్‌సభ సోమవారం ఆమోదించిన ఈ బిల్లుకు మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరుతూ తాము ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినందున బిల్లుపై ఓటింగ్ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. 

అయితే వారి డిమాండ్‌ను మూజువాణి ఓటుతో తిరస్కరించారు. ఓటింగ్ చేపట్టడానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఒబ్రియాన్ నిబంధనలు ఉటంకించారు. ఓటింగ్ చేపట్టడానికి వీలుగా విపక్ష సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవలసిందిగా డిప్యూటీ చైర్మన్ కోరారు. అయితే విపక్ష సభ్యులు వెల్‌లో నినాదాలు కొనసాగించారు. 

ఒబ్రియాన్ కోపంతో రూల్‌బుక్‌ను అధికారులు కూర్చుని ఉన్న టేబుల్‌పైకి విసిరేసి వాకౌట్ చేశారు. అయితే అధికార పక్ష సభ్యులు ఆయన ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా కాంగ్రెస్, టిఎంసి, వామపక్షాలు, డిఎంకె, ఎన్‌సిపిలకు చెందిన సభ్యులు వాకౌట్ చేశారు.

అయితే బిజెపి, జెడి(యు), వైఎప్‌ఆర్ సిపి, అన్నా డిఎంకె, బిజెడి,టిఎంసిఎం సభ్యులు బిల్లును సమర్థించారు. అంతకు ముందు కాంగ్రెస్, టిఎంసి, సిపిఐ, సిపిఎం, డిఎంకె, సమాజ్‌వాది పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ, గోప్యతకు సంబంధించి ఓటరుకున్న హక్కును ఈ బిల్లు హరిస్తుంని ఆరోపించారు. అయితే వారి ఆరోపణలను న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు తోసిపుచ్చారు. 

ఈ చట్టం వల్ల దేశంలో బోగస్, నకిలీ ఓట్లను ఏరివేయడానికి తోడ్పడుతుందని, ఎన్నికల ప్రక్రియను అర్థవంతం చేస్తుందని ఆయన అన్నారు. బిల్లుపై ప్రతిపక్షాల భయాలు అర్థం లేనివని మంత్రి అంటూ, వ్యక్తిగత స్వేచ్ఛపై సుప్రీంకోర్టు తీర్పుకు విపక్షాలు తప్పుడు భాష్యం చేబుతున్నాయని మంత్రి అన్నారు.

రాజ్యసభ నుంచి డెరెక్‌ ఓబ్రెయిన్‌ సస్పెన్షన్‌

ఇలా ఉండగా, రాజ్యసభలో చైర్మన్‌ కుర్చీ వైపుగా ఓ పుస్తకాన్ని విసిరిన టీఎంసీ సభ్యుడు డెరెక్‌ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు డెరెక్‌ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ కొనసాగుతుంది. 
 
ఎన్నికల సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డెరెక్‌ ఓబ్రెయిన్‌ రాజ్యసభ నియమాల పుస్తకాన్ని విసిరిగొట్టినందుకు ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు ప్యానెల్‌ చైర్మన్‌ సస్మిత్‌ పాత్ర తెలిపారు. 
ఇప్పటికే రాజ్యసభలో మరో 12 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 23న ముగియాల్సి ఉంది.