టీఆర్‌ఎ్‌సపై పోరాటం చేయండి.. అమిత్ షా దిశానిర్ధేశం

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ శ్రేణులకు పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ పై యుద్ధం చేయాలని, టీఆర్ఎస్ తో అమీతుమీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలని, కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. . కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండి.. ప్రభుత్వపరంగా ఏమి చేయాలో తమకు వదిలేయాలని ఆయన పేర్కొన్నారు. 

హుజూరాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ విజయభేరి మోగించాలని అమిత్ షా స్పష్టం చేశారు. బీజేపీపై టీఆర్‌ఎస్‌ చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని చెప్పారు. అదే విధంగా,  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా దూకుడు పెంచాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అమిత్‌షా ఆదేశించారు. త్వరలోనే తెలంగాణలో భారీ బహిరంగా సభ నిర్వహిస్తామని తెలిపారు. దీనికోసం సన్నాహాలు చేసుకోవాలని నాయకులకు అమిత్‌ షా సూచించారు. ఈ సభకు తాను  హజరవుతానని పేర్కొన్నారు. సభ నిర్వహించే తేదీని పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
బీజేపీ నేతలను ఉరికించాలని, ఊళ్లలోకి రానీయవద్దంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్‌ డ్రామాలు ఆడతారని, ఆ ఆటలను సాగనీయకుండా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.
కేసులు, నిర్బంధాలు జరుగుతూనే ఉంటాయని, వాటిని ఎదుర్కోవాలని, జాతీయ నాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ మంత్రులు ఈటల రాజేందర్‌, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్‌, మాజీ ఎంపీలు విజయశాంతి,  జి వెంకటస్వామి,  గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి తదితరులు హజరయ్యారు.
 మా పోరాటంపై అమిత్ షా సంతోషం
 
కాగా, ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందడాన్ని అమిత్‌షా అభినందించారని, ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారని భేటీ అనంతరం బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో తమ  పోరాటంపై అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. 
 
కేసీఆర్ నియంతృత్వ పాలన, అవినీతి, కుటుంబ పాలనపై పోరాటాన్ని అభినందించారని, ఇదే పంథాను కొనసాగించాలని, అవినీతిపై పోరాడాలని సూచించారని తెలిపారు.  తెలంగాణలో మరింత ముందుకు పోవాలని,  ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత వెంటనే ప్రారంభించాలని చెప్పారని వివరించారు. ఆయన ఈ యాత్రలో రెండు రోజులపాటు పాల్గొంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.  తెలంగాణలోని పరిస్థితులు, అణిచివేత, పాదయాత్ర, కేసుల గురించి  అమిత్‌షా దృష్టికి‌ తీసుకెళ్లామని సంజయ్ తెలిపారు.