తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు

తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు
తాజాగా తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌ రావు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12 న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు విదేశీయులకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. 
 
వారిలో ఒకరు కెన్యా జాతీయురాలు (24) కాగా, మరొకరు సోమాలియా దేశస్థుడు (23) అని చెప్పారు. 12 వ తేదీనే వీరిద్దరి శాంపిల్స్‌ సేకరించి జీనోమ్‌ సీక్వెన్స్‌కు పంపామని, నిన్న రాత్రి ఫలితాలు వచ్చాయని, వీరిద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని తేలిందని పేర్కొన్నారు. కెన్యా జాతీయురాలిని టిమ్స్‌కు తరలించామని, సోమాలియా దేశస్థుడిని ట్రేస్‌ చేస్తున్నామని వివరించారు. 
 
ఈ ఇద్దరూ మెహిదీపట్నం, టోలీచౌకీలో ఉన్నారని తెలిపారు. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలుడు (7)కి కూడా ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించాయిరు. ఆ బాలుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే కోల్‌కతాకు వెళ్లాడని, రాష్ట్రంలోకి ప్రవేశించలేదని శ్రీనివాస్‌ రావు పేర్కొన్నారు.

ఒమిక్రాన్‌ సోకిన సదరు వ్యక్తుల కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ వచ్చిన రోగులు ఆస్పత్రి నుంచి పారిపోయారనేది అవాస్తవమని డీహెచ్‌ తెలిపారు. గాలిద్వారా ఒమిక్రాన్‌ సోకే ప్రమాదముందని డీహెచ్‌ తెలిపారు.  మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని, ఒమిక్రాన్‌ సోకిన వారికి స్పల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని డీహెచ్‌ తెలిపారు.