తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యామ్నాయంగా బిజెపి 

తెలంగాణలో ప్రతిపక్షం కాంగ్రెస్, ఏపీలో ప్రతిపక్షం టీడీపీ క్షేత్రస్థాయిలో పట్టును కోల్పోతున్న పరిస్థితుల్లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 
 
దక్షిణాది రాష్ట్రాల బిజెపి ఎంపీలతో తన ఇంట్లో జరిపిన అల్పాహార సమావేశంలో ఈ అవకాశాన్ని ఏవిధంగా అందిపుచ్చుకోవాలన్న దానిపై చర్చించారు. ఇందు కేంద్ర ప్రభుత్వం, పార్టీ తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.   
 
ఈ మూడు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ స్థితిగతులపై ప్రధాని ఆరా తీశారు. పార్టీ బలోపేతానికి ఏ చర్యలు తీసుకోవాలన్న దానిపై ఎంపీలకు పలు సూచనలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తమదైన ముద్ర వేసుకున్న బీజేపీని దక్షిణాది రాష్ట్రాల్లోనూ బలోపేతం చేసేందుకు కేంద్ర పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 
 
ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల బిజెపి ఎంపీలు పాల్గొన్నారు.
 
కాగా, చట్టసభ సభ్యులు,  ప్రజా ప్రతినిధులు తమ స్వంత ప్రతిష్టను,  పార్టీని నిర్మించుకునే విధానంలో ఒక నమూనా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు. అందు కోసం, పార్టీ, ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ప్రజలతో సహేజ్ సంపర్క్ (కమ్యూనికేట్ చేయడానికి సులభమైన మార్గాలు) మార్గాలను వెతకాలని ఆయన సూచించారు.

పార్లమెంటులో, వెలుపల జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను లేవనెత్తాలని ప్రధానమంత్రి వారిని కోరారు. పార్టీ ఎంపీలు, మంత్రులతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని, తమ నియోజకవర్గాల్లోని ప్రజలకు క్రీడాపోటీలు వంటి ఉచిత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని  సూచించారు. 

 
“స్పోర్ట్స్ ఎకానమీ ప్రధాన ఫోకస్ ఏరియాగా ఉద్భవిస్తుంది.  కాబట్టి మీరు క్రీడలు, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించాలి.. యువ  క్రీడాకారులు, మహిళలకు శిక్షణ సదుపాయాలు  కల్పించడం కోసం మార్గాలు సృష్టించాలి” అంటి ప్రధాని పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.