కాశీ ప్ర‌తిష్ట, శ‌క్తి న‌లుదిశ‌లా విస్త‌రిస్తోంది

కాశీ ముఖ‌చిత్రాన్ని ప్ర‌భుత్వం మార్చివేసింద‌ని, ఇప్పుడు  కాశీ ప్ర‌తిష్ట, శ‌క్తి న‌లుదిశ‌లా విస్త‌రిస్తోంద‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ తెలిపారు.  మంగ‌ళ‌వారం స‌ద్గురు స‌ద‌ఫ‌ల్‌దేవ్ విహంగ‌మ్ యోగ్ సంస్ధాన్ 98వ వార్షిక వేడుక‌ల్లో పాల్గొని స‌ద్గురు స‌ద‌ఫ‌ల్‌దేవ్‌కు ప్రధాని  నివాళులు అర్పించారు. అనంత‌రం మెగా వార‌ణాసి ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

విశ్వ‌నాధ్ ధామ్‌ను కాశీ న‌గ‌రం ఆ మ‌హ‌దేవుడికి అంకితం చేసింద‌ని కాశీ విశ్వ‌నాధ కారిడార్ ప్రారంభోత్స‌వాన్ని ప్ర‌స్తావిస్తూ పేర్కొన్నారు. ఇక స్వాతంత్య్ర పోరాటంలో స‌న్యాసుల పాత్రను చ‌రిత్ర ప్ర‌స్తావించ‌లేద‌ని ప్రధాని విస్మ‌యం వ్య‌క్తం చేశారు. భార‌త స్వాతంత్య్ర  స‌మ‌రంలో స‌ద్గురు స‌ద‌ఫ‌ల్‌దేవ్‌తో పాటు ఎంద‌రో స‌న్యాసులు పాల్గొన్నా వారి సేవ‌ల‌ను ప్ర‌స్తుతించాల్సిన స్ధాయిలో చ‌రిత్ర‌లో పొందుప‌ర‌చ‌లేద‌ని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. 

అంత‌కుముందు వార‌ణాసిలో త‌న రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కాశీ విశ్వ‌నాధ్ ఆల‌య అధికారుల‌తో సమీక్ష నిర్వ‌హించారు. ఈ ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి ప‌ట్ట‌ణంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో సమావేశ‌మ‌య్యారు.
ఈ స‌మావేశానికి బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, హ‌ర్యానా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ క‌ట్ట‌ర్, ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి పుష్క‌ర్‌సింగ్ ధామి, అసోం ముఖ్య‌మంత్రి హిమాంత బిశ్వ‌శ‌ర్మ‌, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై స‌హా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులంద‌రూ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల్లో ప‌రిస్థితులు, రాజ‌కీయ ప‌రిణామాల గురించి ప్ర‌ధాని ముఖ్య‌మంత్రుల‌ను అడిగి తెలుసుకున్నారు. ప‌లు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతీరు, ప్ర‌జ‌ల్లో స్పంద‌న గురించి ఆరా తీశారు. కేంద్ర ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు గురించి ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల అంశం కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ప్రధాని రాత్రిపూట తనిఖీలు 

ప్ర‌ధాన మంత్రి మోదీ సోమ‌వారం రాత్రి వార‌ణాసి వీధుల్లో న‌డుచుకుంటూ తిరిగారు. అర్థ‌రాత్రి 12.30 గంట‌ల‌కు ఆయ‌న సంత్ ర‌విదాస్ ఘాట్ నుంచి బ‌య‌లుదేరి గొదౌలియా కూడ‌లికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి ప్ర‌ధాని మోదీ విశ్వ‌నాథ్ కారిడార్ చేరుకొని అక్క‌డ జ‌రుగుతున్న‌ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు.

ఆ స‌మ‌యంలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కూడా ఆయ‌న‌కు తోడుగా ఉన్నారు. దాదాపు 20 నిమిషాల‌పాటు ప్ర‌ధాని అక్క‌డే గ‌డిపారు. ఆ త‌రువాత రైలు మార్గాన త‌న గెస్ట్ హౌస్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఈ మొత్తం త‌నిఖీకి సంబంధించిన వివ‌రాలు ప్ర‌ధాన మంత్రి ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

“కాశీలో అభివృద్ధి ప‌నులకు సంబంధించి త‌నిఖీ చేయ‌డం జరిగింది. కాశీ లాంటి ప‌విత్ర న‌గరానికి దేశంలోనే మెరుగైన ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అందించేందుకు ప్రభుత్వం ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ పుణ్య‌క్షేత్రానికి వ‌చ్చే భ‌క్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని రైల్వే క‌నెక్టివిటీ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి” అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

అఖిలేష్ వ్యాఖ్యలపై మండిపడిన బిజెపి 

ఇలా ఉండగా,  జనం తమ చివరి రోజులు గడిపేందుకు కాశీ వెళ్తుంటారని ప్రధాని వారణాసి పర్యటనను ఉద్దేశించి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అఖిలేష్ వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితిని చాటుతున్నాయని కౌంటర్ ఇచ్చింది.

వారణాసిలో రెండు రోజుల పర్యటనకు ప్రధాని సోమవారంనాడు రావడంపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ”మంచిదే. వాళ్లు (ప్రధాని, బీజేపీ నేతలు) నెల రోజులే కాదు, రెండు మూడు నెలలు కూడా ఉండొచ్చు. జనం తమ చివరి రోజులు గడిపేందుకు ఇక్కడకు (కాశీ) వస్తుంటారు” అంటూ ఎద్దేవా చేశారు.

పైగా, బీజేపీ ప్రతి ఒక్కరితోనూ అబద్ధాలు చెబుతోందని, కానీ భగవంతుడి ముందు అబద్ధాలు చెప్పడం సరికాదని అఖిలేశ్ హితవు పలికారు. కాగా, అఖిలేష్ చేసిని ‘చివరిరోజులు’ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారంనాడు ఢిల్లీలో స్పందించారు.

అఖిలేష్ యాదవ్ వాడిన భాష ఆయన మానసిక స్థితిని చెబుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.  సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న ఆందోళనకు ఆయన మాటలు అద్దం పడుతున్నాయని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రి నోట వినాల్సి రావడం దురదృష్టకరమని, అలా మాట్లాడతారని ఊహించలేదని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.