మత ప్రాతిపదికపై దేశ విభజన చారిత్రక తప్పిదం

మత ప్రాతిపదికపై భారత దేశ విభజన చారిత్రక తప్పిదమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 1971  భారత్-పాక్ యుద్ధం మనకు చెబుతున్నదదేనని తెలిపారు. 1971లో భారత్ విజయం, ఇండో-బంగ్లాదేశ్ మధ్య మైత్రీ సంబంధాలు 50వ పడిలో పడిన సందర్భంగా ఇండియా గేట్ వద్ద ఆదివార జరిగిన ‘సర్ణిమ్ విజయ్ పర్వ్’‌లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. 
 
ఇండో-పాక్ యుద్ధం భారత సాయుధ బలగాలు ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని చాటిందని, ఆ దేశగానే తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన చెప్పారు.  ”మతం ప్రాతిపదికతో విభజన జరగడం వల్ల ఒకే మతం ప్రాతిపదికన పాకిస్థాన్ పుట్టింది. 1971 ఓటమి తర్వాత, మన పొరుగుదేశం (పాక్) నిరంతరం భారత్ తో పరోక్ష యుద్ధం సాగిస్తూనే ఉంది” అంటూ ధ్వజమెత్తారు.
ఉగ్రవాదాన్ని, భారత్వ్య తిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని విడగొట్టాలని పాక్ కోరుకుంటోందని రక్షణ మంత్రి దుయ్యబట్టారు.  1971లో పాక్ పన్నాగాలను భారత బలగాలు తిప్పికొట్టాయని చెబుతూ, ఇప్పుటు ఉగ్రవాద మూలాలను తుదముట్టించేందుకు మన సాహస సాయుధ బలగాలకు నిరంతరం శ్రమిస్తున్నాయని తెలిపారు. ప్రత్యక్ష యుద్ధంలో గెలిచిన మనం పరోక్ష యుద్ధంలో కూడా గెలుస్తామని రాజ్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

1971లో భారత్ విజయం చరిత్రనే కాకుండా, దక్షిణ ఆసియా భౌగోళిక స్వరూపంలో మార్పులు తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. సత్యం, న్యాయం వైపే భారత్ ఎప్పుడూ నిలబడుతుందని, యుద్ధం పాకిస్థాన్‌ సైన్యంతో మాత్రమే కాదని, అన్యాయం, చిత్రహింసలపైనని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో విజయం భారత్ విజయం మాత్రమే కాదని, అన్యాయంపై న్యాయం, చెడుపై ధర్మం సాధించిన విజయమని రాజ్‌నాథ్ అభివర్ణించారు. 

బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత దానిపై భారత్ ఆధిపత్యం చెలాయించాలని అనుకోలేదని, అక్కడి రాజకీయ శక్తులకు అధికారం అప్పగించిందని గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పాదుకొలపడంలో భారత్ ఎంతో కృషి చేసిందని చెప్పారు. బంగ్లాదేశ్ గత 50 ఏళ్లలో అభివృద్ధి దిశగా శీఘ్ర పురోగతి సాధిస్తుండటం సంతోషంగా ఉందని, ప్రపంచదేశాలకు కూడా ఇది స్ఫూర్తి అని రక్షణ మంత్రి తెలిపారు. 

భారతదేశం ఎన్నడూ ఆక్రమణల కోసం ఇతర దేశాలపై దాడులు చేయలేదనని ఆయన పునరుద్ఘాటించారు. 1971 యుద్ధంలో విజయం కోసం ప్రాణాలర్పించిన మన సైనికులందరికీ శిరసు వంచి అభివందనం చేస్తున్నానని అంటూ ఆయన కొనియాడారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని పేర్కొన్నారు. 

ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతితో దేశం ఒక వీర సైనికునికి, సమర్ధవంతమైన సలహాదారును కోల్పోయిందని రక్షణ మంత్రి ఆవేదన వ్యక్తం చేసారు. 1971 యుద్ధం 50వ వార్షికోత్సవంలో ఆయన లేకపోవడం ఎంతో విచారకరమని చెప్పా అయితే, వార్షికోత్సవానికి ముందే సాయుధ బలగాలను అభినందిస్తూ జనరల్ రావత్ ముందుగానే రికార్డు చేసిన సందేశాన్ని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా అందరితో పంచుకున్నారు.