రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్‌ ప్రభుత్వం కూలిపోతది

రాష్ట్రంలోని రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్‌ ప్రభుత్వం కూలిపోతదని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ లో ఆత్మహత్య చేసుకున్న రైతు  రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు,  పరామర్శించారు.
 
అనంతరం ఈటల మాట్లాడుతూ  రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ రైతులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. 
 
ఢిల్లీలో రైతుల చనిపోయారని పైసలు ఇస్తామన్న కేసిఆర్.. ఆయన సొంత జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. గత ఆంధ్రా పాలకులకు కేసిఆర్ పాలనకు తేడా లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలన, చంద్రశేఖర్ రావు పాలన ఒకటే రకంగా ఉందని విమర్శించారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
 
వరి పంట వేయొద్దని సీఎం చెప్పడం హాస్యాస్పదమని వారు ధ్వజమెత్తారు. వానాకాలం పంటలో రా రైస్ మాత్రమే ఉంటుందని చెప్పారు. బియ్యం తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వర్షాకాలం వడ్లన్నీ వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యాసంగిలో వచ్చే పంటపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత  లేదని విమర్శించారు.
వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్‌ మొసలి కన్నీటిని రైతులు నమ్మొద్దని ఈటెల కోరారు. రైతాంగానికి బీజేపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఈటల హామీ ఇచ్చారురు. రవి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50 వేలను అందజేశారు.
బియ్యం రీ సైక్లింగ్ దందాలో కేటీఆర్
 
రాష్ట్రంలో బియ్యం రీ సైక్లింగ్ దందాలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని బిజెపి ఎంపీ అరవింద్  సంచలన ఆరోపణలు చేశారు. వడ్లు, బియ్యంతో కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు సందర్శించడం లేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత బంధు పథకం ఏమైందని ప్రశ్నించారు. పంట మార్పిడిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో  రైతులు అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. మూతపడిన చెరకు ఫ్యాక్టరీలు తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
పంటలకు బోనస్ ప్రకటించాలని కోరారు. బాయిల్డ్ రైస్ సప్లై చేయలేమని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మాట మార్చి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ధాన్యంలో భారీ ఎత్తున బ్లాక్ మార్కెట్ జరుగుతోందని తెలిపారు.