తిరుమలకు మూడో ఘాట్‌రోడ్‌ నిర్మాణం

అన్నమయ్య మార్గంలో మూడో ఘాట్‌రోడ్‌, నడక మార్గం నిర్మించాలని టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి రోడ్డు, కాలినడక మార్గాలను నిర్మిస్తామని పాలకమండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా దెబ్బతిన్న ఆలయాలను పునరుద్ధరణ చేసేందుకు పాలకమండలి ఆమోదించిన్నట్లు ఆయన చెప్పారు. శ్రీశైలంలో ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని తెలిపారు. గత ఏడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని తీర్మానించినట్లు చెప్పారు.
కొత్త ఏడాదిలో భక్తుల సౌకర్యం కోసం  దర్శన టికెట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. కొత్త ఏడాదిలో శ్రీవారి దర్శన టికెట్లు పెంచడంతోపాటు ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని సుబ్బారెడ్డి వివరించారు. సంక్రాంతి తర్వాత దర్శన టికెట్లు పెంచుతామని పేర్కొన్నారు. 
 
పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. తిరుపతిలో ప్రారంభించిన పిడియాట్రిక్ ఆసుపత్రిలో విజయవంతంగా హార్ట్ సర్జరీలు జరుగుతున్నాయని తెలిపారు. నెల రోజుల్లో 11 మంది పిల్లల ప్రాణాలు కాపాడామని చెప్పారు.
శ్రీవారి ఆలయం ఎదురుగా నిర్మిస్తున్న పరకామణి భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెబుతూ పరకామణి‌లో చిల్లర నాణేల ప్యాకింగ్‌కు రూ.2.80 కోట్లతో యంత్రాలు కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల్లోని గిరిజనులు, మత్స్యకారులను తీసుకొచ్చి దర్శనాలు చేయించాలని నిర్ణయించామని తెలిపారు.
హనుమాన్‌ జన్మస్థలమైన అంజనాద్రిని అభివృద్ధి చేస్తామని,  నాదనీరాజనం మండపం దగ్గర శాశ్వత మండపం నిర్మిస్తామని వివరించారు. భక్తులుకు శ్రీవేంకటేశ్వర నామ కోటి పుస్తకాలను అందిస్తామని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
రూ 3 కోట్ల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. రూ 10 కోట్లతో స్విమ్స్ లో భవనాలు నిర్మాణం జరుగుతుందని, రూ.12 కోట్ల వ్యయంతో మహిళా యూనివర్సిటీలో హస్టల్ భవనాలు నిర్మిస్తామని వివరించారు.