ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా కొద్దిసేపు హ్యాక్‌

ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా  ఆదివారం హ్యాక్‌ అయింది. అయితే దాన్ని కొంతసేపటి తర్వాత ట్విటర్‌ యాజమాన్యం పునరుద్ధరించింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్‌ అకౌంట్‌లో బిట్‌కాయిన్‌లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు.

భారత్‌లో బిట్‌కాయిన్‌ను చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతున్నదని లింక్‌లు పోస్ట్‌ చేశారు.హ్యాకర్ల ట్వీట్‌పై ప్రధాని కార్యాలయం అధికారులు ట్విటర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.

అనంతరం ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతాను రీస్టోర్‌ చేశారు. కాగా, హ్యాకింగ్‌ సమయంలో ట్వీట్‌లను పట్టించుకోవద్దని ప్రధాని కార్యాలయం విజ్ఞప్తిచేసింది.  ప్రధాని  మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కాసేపు హ్యాకింగ్‌కు గురికావడంపై ట్విటర్ స్పందిస్తూ ఈ ఖాతాను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.

ప్రధాన మంత్రి కార్యాలయంతో తమకు నిరంతర కమ్యూనికేషన్ సదుపాయం ఉందని, ఆయన ట్విటర్ హ్యాండిల్‌పై దాడి జరిగినట్లు తెలిసిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకున్నామని ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మోదీ ట్విటర్ ఖాతాపై దాడి జరిగిన సమయంలో ఇతర ఖాతాలపై ప్రభావం పడినట్లు ఎటువంటి సంకేతాలు అందలేదని పేర్కొన్నారు. 

బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా వినియోగించేందుకు భారత దేశం అధికారికంగా ఆమోదం తెలిపిందనే ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసి చాలామంది యూజర్లు షేర్ చేశారు. క్రిప్టోకరెన్సీలపై బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. 

తప్పుడు వాగ్దానాలతో పెట్టుబడులను ఆకర్షించేందుకు క్రిప్టోకరెన్సీలను ఉపయోగించుకుని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను మళ్ళించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.