సోషల్‌ మీడియా, క్రిప్టో కరెన్సీలపై అంతర్జాతీయ నిబంధనలు

సోషల్‌ మీడియా, క్రిప్టో కరెన్సీ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న సాంకేతికతలకు అంతర్జాతీయంగా నిబంధనలను రూపొందించేందుకు ఐక్య కృషి జరగాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి అవి ఉపయోగపడాలి తప్ప దెబ్బతీయడానికి కాదని ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. 
 
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‘ప్రజాస్వామ్య సదస్సు’ పేరుతో నిర్వహిస్తున్న సదస్సులో ప్రధాని  మాట్లాడుతూ, స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలను నిర్వహించడంలో, పాలనకు సంబంధించిన అన్ని  రంగాల్లో పారదర్శకతను పెంపొందించడంలో తమ అనుభవాలను, నైపుణ్యాలను పంచుకోవడం భారత్‌కు సంతోషకరమైన అంశమని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంపై అబ్రహం లింకన్‌ ప్రఖ్యాతి చెందిన కోట్‌ను మోదీ  ఈ సందర్భంగా ఉదహరించారు. ప్రజాస్వామ్యమనేది ‘ప్రజలతో, ప్రజల్లో వుండాలని’ చెబుతూ  బహుళ పార్టీల ఎన్నికలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛా మీడియా వంటి వ్యవస్థాగత అంశాలు ప్రజాస్వామ్యానికి కీలకమైన సాధనాలని మోదీ తెలిపారు. 
 
 ప్రజాస్వామ్యం మౌలిక బలమనేది మన పౌరులు, మన సమాజాలు అందించే స్ఫూర్తి, పాటించే నైతిక విలువలపై ఆధారపడి వుంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యమనేది ప్రజల కొరకు, ప్రజల చేత మాత్రమే కాదు, ప్రజలతో, ప్రజల్లో వుండాల్సిందని మోదీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది భారతదేశ నాగరికతా విలువల్లోనే అంతర్భాగంగా వుందని ఆయన స్పష్టం చేశారు. 
 
శతాబ్దాల తరబడి వలస పాలన సాగినా భారతీయుల ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయలేకపోయారని తెలిపారు. భారతదేశ స్వాతంత్య్రంలో పూర్తి స్థాయిలో ఈ ప్రజాస్వామ్యమనే భావన స్పష్టంగా ప్రకటితమైందని ప్రధాని చెప్పారు. గత 75 ఏళ్లలో ప్రజాస్వామ్యంతో కూడిన దేశ నిర్మాణంలో తిరుగులేని విజయం సాధించిందని చెప్పారు. అంతర్జాతీయంగా, బహుళ వ్యవస్థలలో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం కోసం పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధాని తెలిపారు. 
 
అన్ని రంగాల్లో అపూర్వమైన రీతిలో సామాజికంగా, ఆర్థికంగా అందరినీ కలుపుకునిపోవడం సాధ్యమైందని ప్రధాని గుర్తు చేశారు. ఆరోగ్య, విద్య, మానవ సంక్షేమ రంగాల్లో అనూహ్యమైన రీతిలో నిరంతరంగా మెరుగుదల సాధించుకుంటూ వస్తున్నామని చెప్పారు. భారతదేశం సాధించిన ఈ విజయం యావత్‌ ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశమని మోదీ  పేర్కొన్నారు. అటువంటి ప్రజాస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
 
అందరూ కలిసికట్టుగా కృషి చేయడం ద్వారా ప్రజాస్వామ్య దేశాలన్నీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలవని, మొత్తంగా మానవాళి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందుకుంటుందని ప్రధాని ఈ సందర్భంగా సూచించారు. ఈ బృహత్తర కృషిలో సహచర ప్రజాస్వామ్యాలతో చేతులు కలపడానికి భారత్‌ సిద్ధంగా వుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం తనకెంతో గర్వకారణంగా వుందని చెప్పారు. 
 
క్రిప్టో కరెన్సీలను నియంత్రించాల్సిన, దాని కోసం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం వుందని మోదీ మరోసారిఅంతర్జాతీయ సమాజనైకి సూచించారు. గత మూడు వారాల్లో రెండుసార్లు ఆయన దీని గురించే ప్రస్తావించడం గమనార్హం. గత నెల 18న సిడ్నీ డైలాగ్‌ సదస్సులో కూడా ప్రధాని మాట్లాడుతూ, క్రిప్టో కరెన్సీ తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా చూసేందుకు ప్రజాస్వామ్య దేశాలు కృషి చేయాలని కోరారు.