బియ్యం సేకరణలో తెలంగాణ సర్కారు పదేపదే తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డాయిరు. ఎఫ్‌సీఐ తెలంగాణ నుంచి రికార్డు స్థాయిలో బియ్యాన్ని సేకరించేందుకు ఆమోదం తెలిపినా తమకు అన్యాయం జరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ వికేంద్రీకృత సేకరణ రాష్ట్రం అయినందున ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేకరించదని, రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి బియ్యంగా మార్చి ఇస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్రానికి అధిక బియ్యం ఇచ్చేందుకు వీలుగా తాము రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగైదు సార్లు సమయాన్ని పొడిగించామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున అనుమతులు కూడా ఇచ్చామని గుర్తు చేశారు.
అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనుగోలులో విఫలమవుతోందని చెబుతూ అలా చెప్పడానికి తనకు బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. అయినా ఈ బియ్యాన్ని సేకరించేందుకు ఎఫ్‌సీఐ సిద్ధంగా ఉందని, తాము సమయాన్ని పొడిగించామని గోయల్ చెప్పా రు.తెలంగాణ నుంచి ఎంత వేగంగా బియ్యం వస్తే ఎఫ్‌సీఐ కూడా అంతే వేగంగా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే ఎంత బియ్యం సేకరించాలో ఎఫ్‌సీఐ నిర్ణయిస్తుందని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చెప్పారు. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే అదనపు బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా తెలంగాణ కేంద్ర పూల్‌కు మళ్లిస్తుందని ఆమె వివరించారు. తెలంగాణపై ఎలాంటి వివక్షా చూపలేదని ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని ఆగస్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోగా.. ఇప్పటి వరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సరిపడా ధాన్యాన్నే సేకరించారని ఉత్తమ్ తెలిపారు.
ప్రతి గింజా కొంటామన్న సీఎం కేసీఆర్ ఇంకా గోనె సంచులను కూడా కొనలేదని ఎద్దేవా చేశారు. కల్లాలకు వచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పా రు.
More Stories
ప్రజాస్వామ్యానికి మూల స్తంభం మీడియా
మున్సిపల్ ఎన్నికల వాయిదాకు రేవంత్ ఎత్తుగడలు
రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా?