విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకులకు దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో ఒమిక్రాన్ పరీక్షలు అధికారులు నిర్వహిస్తున్నారు. ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేస్తున్నప్పటికీ ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుండటంతో విమానాశ్రయంలో రద్దీ నెలకొంది.
ఈ రద్దీని తగ్గించేందుకు, ఫలితాలు త్వరగా వచ్చేలా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగం ఆర్‌టి-లాంప్ కరోనా కిట్‌ను రూపొందించింది. నిపుణుల అవసరం లేకుండా సులభంగా ఈ కిట్‌తో కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని,. ఫలితాలు అరగంటలోపే వస్తాయని ఐసిఎంఆర్ పేర్కొంది.
రెండు వారాల్లో అందుబాటులోకి రానున్న ఆర్‌టీ-లాంప్ వందశాతం సమర్థంగా పనిచేస్తుందని, కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని ఐసిఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఇతర కరోనా పరీక్షల కంటే ఈ ఆర్‌టీ-లాంప్ పరీక్షకు 40శాతం తక్కువ ఖర్చవుతుందని తెలిపారు.
వీటిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడం కోసం ఢిల్లీ, చెన్నైలోని పలు కంపెనీలకు నమూనాలు పంపించామని, మరో రెండు వారాల్లో ఈ కొత్త కరోనా కిట్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఇవి విమానాశ్రయాలతోపాటు, ఓడరేవులు, రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయని ఐసిఎంఆర్ తెలిపింది.
ఇలా ఉండగా, కరోనాపై రాష్ట్రాలను కేంద్రం మరోసారి అప్రమత్తం చేసింది. కరోనాకి సంబంధించి ఎన్ని దశలొచ్చినా, ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. రెండో దశలో డెల్టా వేరియంట్ విజృంభించినట్టే, ఒమిక్రాన్ రూపంలో మూడో దశ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
డెల్టా కంటే ఆరింతలు వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ పై అప్రమత్తంగా ఉండాలంది. అన్ని జిల్లా కేంద్రాల్లో టెలీ వైద్య వ్యవస్థను విస్తరించాలని చెప్పింది. జిల్లా స్థాయి హాస్పిటల్స్ లో కొత్తగా క్రిటికల్ కేర్ పడకలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న పడకల సంఖ్య పెంచాలని సూచించింది.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్