ఫుకాన్‌, మౌజోలకు జ్ఞానపీఠ పురస్కారం

కొంకిణి కథా రచయిత దామోదర్‌ మౌజో(77)కు దేశ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్‌ అవార్డు లభించింది. అస్సామీ కవి నీలమణి ఫూకాన్‌కు 56వ (2020) జ్ఞానపీఠ్‌ అవార్డు, కొంకణి చిన్న కథా రచయిత, నవలా రచయిత దామోదర్‌ మౌజోకు 57వ (2021) జ్ఞానపీఠ్‌ అవార్డును ప్రకటించారు.  సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వీరిద్దరికీ ఈ పురస్కారాన్ని మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
 
అస్సామీ కవిత్వంలో ఫుకాన్‌కు మంచి పేరు ఉంది. ఆ భాషా సాహిత్యంలో రుషిగా ఆయనను అభివర్ణిస్తారు. ఆయన కవిత్వ పరిఽధి చాలా విస్తృతమైనది. రాజకీయాలు మొదలు విశ్వం వరకు, సమకాలీన విషయాల నుండి ప్రాచీన సంస్కృతి వరకు.. ఇలా అనేక అంశాల మీద రచనలు చేయగల మేధావి. 
 
కొంకణీ రచయితల్లో సుప్రసిద్ధుడైన దామోదర్‌ మౌజో 50 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. గోవాలో జన్మించిన ఈయన విమర్శకుడు, కథా రచయిత. ఆయన లఘు కథలు, నవలలు, విమర్శ, బాల సాహిత్యం తదితర రచనలు చేశారు. బాల సాహిత్యానికి సంబంధించి ఆరు లఘు కథల సంకలనాలు, నాలుగు నవలలు రచించారు.
 మౌజో రెండు నవలలు, చిన్న కథా సంకలనాలు, పుస్తకాలు రచించారు. 1983లో కార్మెలిన్‌ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇది పన్నెండు భాషల్లోకి అనువదించబడింది. మౌజో కథలు చాలా సూటిగా, స్పష్టంగా ఉంటాయి. ఇందులో చాలా వరకు మహిళలే కేంద్రంగా ఉంటాయి. 
 
మానవ సంబంధాలు, సామాజిక మార్పు, మతం, వర్గం, మానవత్వంలోని అనేక కోణాలపై ఆయన రచనలు చేశారు. ఇవి చాలా వరకు కొంకణీ భాషలోనే ఉన్నా, ఆయన ఆలోచనలు భారత దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి.  అతని అనేక కథలు అనేక జాతీయ సంకలనాలు, పత్రికల్లో ప్రచురించబడ్డాయి.
అతని కొన్ని కథలు ఇంగ్లీషుతో పాటు పోర్చుగీస్‌ మరియు ఫ్రెంచ్‌ భాషల్లోకి అనువదించారు.  దామోదర్‌ మౌజో అనేక అవార్డులను గెలుచుకున్నారు. అతను క్రియేటివ్‌ ఫిక్షన్‌ 1998 కథా అవార్డు, 1997 గోవా స్టేట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ సంభాషణ అవార్డు, గోవా కళా అకాడమీ అవార్డు, కొంకిణి భాషా మండల అవార్డును గెలుచుకున్నాడు.
 

మౌజో 2011-2012కి భారత ప్రభుత్వ సాంస్కఅతిక మంత్రిత్వ శాఖ నుంచి సీనియర్‌ ఫెలోషిప్‌ కూడా పొందారు. కల్‌బుర్గీ హత్యానంతరం.. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించటాన్ని ఆయన వ్యతిరేకించారు.

జ్ఞానపీఠ్‌ అవార్డు పొందిన అస్సామీ కవి నీలమణి ఫుకాన్‌ 1933లో అసోంలోని దర్గావ్‌లో జన్మించారు. అతను 1981లో అస్సామీ సాహిత్య అకాడమీ అవార్డు, 1990లో అస్సామీ భాషలో తన సాహిత్య కృషికి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆయన రచనలు భారత దేశం సహా ప్రపంచలోని పలు దేశాల భాషల్లోకి అనువాదమయ్యాయి.