బ్యాంకుల నుంచి ఏపీకి రూ.57,479 కోట్ల రుణాలు

ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఏపీ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి రూ.57,479 కోట్లు అప్పు చేసింది. ఏపీలో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలను మంజూరు చేశాయి.  అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్రంస్పష్టం చేసింది. 
 
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ఈ వివరాలను వెల్లడించారు.2019 నుంచి 2021 నవంబర్ వరకు రుణాలను బ్యాంకులు మంజూరీ చేశాయి. అత్యధికంగా ఎస్‌బీఐ నుంచి రూ.11,937 కోట్లు రుణాన్ని 9 సంస్థలు పొందాయి. బీవోబీ నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్ల అప్పు తీసుకున్నాయి.
 
బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మూడు సంస్థలకు రూ.7 వేల కోట్ల రుణం లభించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2970 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ. 750 కోట్ల అప్పును సంస్థలు తీసుకున్నాయి. 
 
ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 5,500 కోట్లు, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ నుంచి రూ. 1,750కోట్ల రుణం తీసుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్ల రుణాలు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. 
 
జీఎస్టీ పరిహారం కింద రూ.543 కోట్లు 
కాగా,  జీఎస్టీ పరిహారం కింద నవంబర్ 3 న రాష్ట్రాలకు రూ.17 వేల కోట్లు విడుదల చేశామని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా కింద రూ.543 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.  రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఏప్రిల్ 20 నుంచి మార్చి 21 మధ్య జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు విడుదల చేసిన రూ.1,13,464 కోట్లకు ఇది అదనం ఆయన చెప్పారు.

2017లో జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద రావాల్సిన మొత్తాలను పూర్తిగా విడుదల చేశామని మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గాయని మంత్రిపేర్కొన్నారు. 

ఇదే సమయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం వాటా పెరిగిందని, కానీ ఆ మేరకు చెల్లింపులు చేసేందుకు జీఎస్టీ పరిహార నిధిలో సరిపడా నిధులు లేవని స్పష్టం చేశారు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు జీఎస్టీ పరిహారం కింద కేంద్రం ఇంకా రూ.51,798 కోట్లు బకాయి ఉన్నదని మంత్రి వెల్లడించారు.