లక్ష కోట్లు ఖర్చు పెట్టినా చుక్కనీరివ్వని కాళేశ్వరం

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టినా చుక్కనీరివ్వలేదని..  శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి రివర్స్ లో నీళ్లు తెచ్చి కాళేశ్వరం పేరుతో మభ్యపెడుతున్నారని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మిగులు ఆదాయంతో ఉన్న రాష్ట్రాన్ని రూ 4 లక్షల కోట్ల అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆయన విమర్శించారు. 

నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో జరుగుతున్న బీజేపీ రెండో రోజు శిక్షణ తరగతులలో పాల్గొంటూ ఖానాపూర్ లో అంబేద్కర్ విగ్రహానికి తనవంతుగా సహాయం అందిస్తానని చెప్పారు. దేశాన్ని మోదీ  పాలించ గలడా అని చాలా మందికి అపోహాలు ఉండేవని, అవన్నీ పాటాపంచలయ్యేలా అద్భుత పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు.

గుజరాత్ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మాడల్ గా తయారు చేసిన ఘనత మోదీకే  దక్కుతుందని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత బిజేపీ ప్రభూత్వానిదన్నారు. ప్రధాన మంత్రి ఫోటో పెట్టాల్సి వస్తుందని ఆవాస్  యోజన నిధులను కేసీఆర్ డ్రా చేయడం లేదని వివేక్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలు అమలు చేయకుంటే లబ్ధిదారులకు కేంద్రమే నేరుగా నిధులివ్వొచ్చని ఆయన పేర్కొన్నారు.

 ప్రధాని ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ పథకాల నిధులు లబ్ధిదారులకు నేరుగా ఇవ్వాలని ప్రధానిని కోరుతామని తెలిపారు. రేషన్ బియ్యం పంపిణీ కేంద్ర పథకం, రూ.30లో 28 కేంద్రమే చెల్లిస్తుందని ఆయన వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రం ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని,  ఆదిశగా ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తున్నామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైతే.. ప్రధాని నిర్ణయాల వల్ల విపత్తును ఎదుర్కొన్నామని గుర్తు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చెన్నూరు నియోజకవర్గంలో 40వేల ఎకరాలు ముంపునకు గురై రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని, అనవసరమైన రాజకీయం చేశారని స్పష్టం చేశారు. అదే విధంగా రైతుచట్టాల్లో ఎక్కడా రైతుకు నష్టం లేదు కానీ విపక్షాలన్నీ చెడు వాతావరణాన్ని సృష్టించాయని వివేక్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా రాష్ట్రం ప్రచారం చేసుకుంటుందని ధ్వజమెత్తారు. 

 ప్రపంచంలో భారత దేశం మినహా ఏ దేశం కూడా 110 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించలేదని ఆయన తెలిపారు. కార్యకర్తలు పార్టీ బలోపేతానికి మరింత కృషిచేయలని, కేసీఆర్ ను గద్దె దించడానికి కంకణం కట్టుకొని పనిచేయాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. హుజురాబాద్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు బీజేపీ వైపే నిలిచారని గుర్తు చేశారు.