ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల అంతరాష్ట్ర ముఠాలపై ఈడీ దాడులు

హైదరాబాద్, విజయవాడ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 15 ప్రాంతాల్లో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఒకేసారి తనిఖీలు చేపట్టారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, మోసపూరిత ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ల ద్వారా సామాన్యులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు.  మహారాష్ట్రలోని పుణే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ కేసులో అధిక లాభాల కోసం సామాన్యులను ఆకర్షించి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంతర్రాష్ట్ర ముఠాల కార్యకలాపాలను గుర్తించారు. ఇందులో భాగంగా గత వారం ఢిల్లీ, ముంబయి, గురుగ్రామ్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో లభించిన సమాచారం, లింకుల ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏజెంట్లు, హవాలా ఆపరేటర్లపై తాజాగా సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. 
 
బెట్టింగ్, మోసపూరిత యాప్‌ల ద్వారా సమీకరించిన డబ్బును షెల్ కంపెనీలు, క్రిప్టోకరెన్సీ మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఈ తనిఖీల్లో ప్రధాన అనుమానితుల ఇళ్లు, ఆఫీసుల్లో లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, బ్యాంకు పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల్లో నగదు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు, హవాలా నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. 
 
అయితే ఏ ఏ చోట్ల తనిఖీలు చేస్తున్నారు? అక్కడ నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర ఆస్తులు లేదా డాక్యుమెంట్లకు సంబంధించి ఈడీ అధికారులు ఇంకా వెల్లడించలేదు.  అక్రమ మార్గాల్లో సంపాదించిన నల్లధనాన్ని చట్టబద్ధమైన ధనంగా మార్చడాన్ని నిరోధించేందుకు భారత ప్రభుత్వం 2002లో మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) తీసుకొచ్చింది. 
 
ఇది అత్యంత కఠినమైన చట్టం. పలు నేరాల ద్వారా సంపాదించిన ఆదాయాన్ని తిరిగి తీసుకోవడం, దానికి బాధ్యులైన వారికి శిక్ష విధించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే బెయల్ రావడం చాలా కష్టమవుతుంది. సాధారణ క్రిమినల్ కేసులలో నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులపైన ఉంటే, ఈ చట్టంలో మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని, తన ఆస్తులు చట్టబద్ధమైనవేనని ప్రూవ్ చేసుకునే అవసరం పూర్తిగా నిందితుడిపైనే ఉంటుంది.

About The Author