‘ఎల్ నినో వస్తున్నది. తాగడానికే నీళ్లు లేవు. సాగుకు చుక నీరివ్వలేం. కరెంట్ లేదు. సాగుబడి ఆపండి. ఏసీలు బంద్ చేసుకోండి. ఇంట్లో కూర్చోండి’ అంటూ రాష్ట్రంలో కరువుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాభవన్ వేదికగా చేతులెత్తేశారు. ఎండలు ముదిరితే ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదని, రాబోయే 8 నుంచి 10 నెలలు అత్యంత గడ్డుకాలమని స్వయంగా ప్రజలకు స్పష్టం చేశారు.
ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరని, అప్రమత్తతతోనే బయటపడాలని చెప్తూనే ‘ఇది క్యాన్సర్ లాంటి నిజం, ప్రజలకు ముందే చెప్పకపోతే నష్టపోతాం’ అంటూ నిస్సహాయతను వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో 20 శాతం నీటి నిల్వలు కూడా లేవని, మొత్తం నిల్వలు 200 టీఎంసీలకు మించి లేకపోవడంతో దాదాపు అన్ని జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయని సీఎం చెప్పుకొచ్చారు.
వచ్చే నాలుగు నెలలపాటు పంటలకు చుక నీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. తాగడానికే నీళ్లు లేనప్పుడు పంటలకు సాగునీరు ఎకడి నుంచి తెచ్చి ఇస్తామని ఎదురు ప్రశ్నించారు. ఎల్ నినోతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ నెలల క్రితమే హెచ్చరించినప్పుడు నీటిపారుదల శాఖ నిద్రపోయి, ఇప్పుడు చేతులెత్తేయడమేందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వర్షాకాలంలో కాళేశ్వరం నుంచి నీటిని తోడుకొని చెరువులు నింపుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేదే కాదని అంటున్నారు. తీరా పంటలు పొట్టదశకు వచ్చే అత్యంత కీలకమైన సమయంలో సాగుకు నీళ్లు బంద్ అని ప్రకటించి, రైతులను అగాధంలోకి నెట్టేయడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పంపుసెట్ల పరిస్థితిని సీఎం వివరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షల బోర్లలో ఇప్పటికే దాదాపు 15 లక్షలు పూర్తిగా ఎండిపోయాయని చెప్పారు. రైతు వేదికల్లో కౌన్సిలింగ్ ఇచ్చి ఆరుతడి పంటలు, కూరగాయలు మాత్రమే వేయించాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి వాటికి నిధులు ఎకడి నుంచి వస్తాయో మాత్రం స్పష్టం చేయలేదు.
ఇప్పటికే తీవ్ర నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీల మీదే ఈ భారాన్ని తోసేస్తే, ఆ కేంద్రాలు ఎలా నడుస్తాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరువు బారిన పడిన పల్లెలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయకుండా, కేవలం ఆదేశాలు జారీ చేసి సరిపెట్టుకోవడం పాలనా డొల్లతనానికి నిదర్శనమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 358 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు చెబుతూ 18 జిల్లాల్లో కనిష్ఠ వర్షపాతం నమోదు కాగా, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 324 మండలాల్లో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలోఉన్నాయని చెప్పారు. రిజర్వాయర్లలో 470 టీఎంసీలకు గానూ 170 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. సింగూరు జలాశయంలో నీటి కొరత పరిస్థితులను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించామని స్పష్టం చేశారు.
More Stories
భవిష్యత్ యుద్ధాలలో ఏఐ, డ్రోన్లకు భారత సైన్యం ప్రాధాన్యత
భారతదేశంలోకి స్టార్‌లింక్ ప్రవేశాన్ని నిరోధించండి
ఆసియా పారా క్రీడల్లో 114 పతకాలతో భారత్ సరికొత్త రికార్డు!