కేటీఆర్ ఓ హైటెక్ మంత్రి, మున్సిపల్ మంత్రిగా పనికిరారు 

కేటీఆర్ ఓ హైటెక్ మంత్రి అని, మున్సిపాలిటీ మంత్రిగా ఆయన పనికిరారని కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ధ్వజమెత్తారు. మున్సిపల్ చట్టంలో మార్పులతో కౌన్సిలర్లకు గౌరవం లేకుండా చేశారని మండిపడ్డారు. 

కరీంనగర్ నుండి స్థానిక సంస్థల నుండి జరుగుతున్న ఎమ్యెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన 500 సెక్షన్లు ఉన్న చట్టాలను 226కు కేటీఆర్  కుదించారని పేర్కొన్నారు. దీని వల్ల కౌన్సిలర్లకు ఎలాంటి పవర్స్ లేకుండా పోయాయని, వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిరిసిల్లలో దళితులపై చాలా దాడులు జరిగాయని.. క్యాంపు రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. ‘సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రెబల్ క్యాండిడేట్లు 12 మంది గెలిచారు. దీనికి ఏం సమాధానం చెబుతారు? మీ మీద వ్యతిరేకత విపరీతంగా ఉంది” అంటూ విమర్శించారు.

కేటీఆర్ ఏనాడైనా రాష్ట్రంలోని కౌన్సిలర్లకు ఒక్కటైనా శిక్షణా శిబిరం పెట్టారా? అని ప్రశ్నించారు. కానీ ఓట్ల కోసం శిబిరాలు పెట్టి, విహర యాత్రలకు తీసుకెళ్తారని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో ఏ ఒక్క ఇసుక లారీ అయినా లీగల్ గా పోతుందా చెప్పాలని సవాల్ చేశారు. హైటెక్ మంత్రి జనాల్లో ఉండాలని చెబుతూ ఏం  చూసుకుని ఓటెయ్యాలో చెప్పండని నిలదీశారు.

అధికార పార్టీ అభ్యర్థి భాను ప్రసాద్ ఈ పన్నెండేళ్లలో ఏనాడైనా సిరిసిల్లకు వచ్చి కౌన్సిలర్లతో సమావేశం పెట్టాడా? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో మాట్లాడాడా? అని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఆయనకు ఇక్కడ ఓటు కూడా లేదని చెబుతూ అలాంటి భాను ప్రసాద్ ఏ విధంగా ఓటెయ్యాలో చెప్పాలని అడిగారు.

‘నేను నామినేషన్ వేశానని పెద్ద ఎత్తున క్యాంపులు పెడుతున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లకు నేను విన్నపం చేస్తున్నా.. మీరు క్యాంపుల్లో ఎంజాయ్ చేయండి. అవి మీ పైసలతో ఏర్పాటు చేసినవే. మీ డబ్బులతో మీ కోసం క్యాంపులు పెడుతున్నరు. నా నామినేషన్ తో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు గౌరవం పెరిగింది’ అని పేర్కొన్నారు. 

తాను నామినేషన్ వేసినందుకే ఎన్నికలు జరుగుతున్నయని చెబుతూ తన వల్లే  ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు తొలిసారి సమయానికి జీతాలు పడ్డాయని చెప్పారు. తాను గెలిస్తే  సరికొత్త కార్యక్రమాలతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల గౌరవాన్ని కాపాడతా అని భరోసా ఇచ్చారు. 

ధనబలం, కండబలం, అండబలంతో పోరులో తన  వైపు ఉన్నది కేవలం ఆత్మగౌరవమే అని రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జాతీయ జెండా ఎగరవేసేందుకు ఎంపీటీసీలకు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది వాళ్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు.