బ్రిటన్‌లో కలకలం… 160 ఒమిక్రాన్‌ కేసులు

కరోనా నయా వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు  ఇప్పటివరకు 30కిపైగా దేశాల్లో నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్‌ ఇప్పుడు బ్రిటన్‌లో కలకలం సృష్టిస్తున్నది. దేశంలో ఇప్పటివరకు 160 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిలోనే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధించింది. బ్రిటన్‌కు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష తప్పనిసరిచేసింది. నైజీరియా నుంచి వచ్చినవారి హోటళ్లకు తరలిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ తెలిపారు. 

ఒమిక్రాన్‌ వ్యాప్తిని నిలువరించడాని అంతర్జాతీయ ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచుతామని, ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తున్నామని ప్రకటించారు.  నైజీరియా నుంచి వచ్చినవారు హోటళ్లలో క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తిని నిలువరించాడనికి ట్రావెల్‌ రిస్ట్రిక్షన్స్‌ అవసరమని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు.

ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్ ఎంతవరకు ప్రభావం చూపుతుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని వెల్లడించారు. డిసెంబర్‌ 20న దేశంలో ఒమిక్రాన్‌ పరిస్థితులను మరోసారి పరీక్షిస్తామని చెప్పారు. బ్రిటన్‌ ఇప్పటికే నైజీరియా సహా ఆఫ్రికా తొమ్మిది దేశాలను రెడ్‌ లిస్ట్‌లో ఉంచింది.

కేవలం బ్రిటన్‌కు సంబంధించిన వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తున్నారు. ఇకపై బ్రిటన్‌కు రావాలనుకునేవారు రెండు రోజులముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, నెగెటివ్‌ వస్తేనే అనుమతిస్తామని ప్రధాని ప్రకటించారు.

కాగా, భారత్‌ సహా విదేశాల నుంచి తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు తప్పనిసరి అని అమెరికా ఆంక్షలు విధించింది. పలు దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. 

కొత్త నిబంధనలు ఈ నెల 6 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా ఆరోగ్య విభాగమైన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ (హెచ్‌హెస్‌ఎస్‌), సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సిడిసి) తెలిపింది. రెండేళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సున్న ప్రయాణీకులందరికీ ఈ రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ప్రయాణానికి ఒక రోజు ముందుగానే కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు తీసుకోవాల్సివుంటుందని తెలిపింది.