
భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విలయం సృష్టిస్తోంది. ఆదివారం ఒక్క రోజే 17 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇందులో 9 కేసులు రాజస్థాన్‌లోని జైపూర్ ఆదర్శ నగర్‌లో వెలుగు చూశాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మరో ఏడు మహారాష్ట్రలోని పుణెలో నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో ఇప్పటివరకు దేశంలో ఐదు రాష్ట్రాలలో నమోదయిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. జైపూర్‌లో వెలుగు చూసిన తొమ్మిది మంది ఇటీవల దక్షిణాఫ్రికానుంచి వచ్చారు. అనంతరం వారికి నిర్వహించిన పరీక్షల్లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఒక్క సారిగా భారీ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో నాగౌర్‌లోని రోహిసా ప్రాంతంలో రాజస్థాన్ ప్రభుత్వం కర్ఫూ విధించింది.
అలాగే నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రిచించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆమె సోదరుడు,అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్ వెలుగు చూసింది. కాగా మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెల్లో ఒకరు, మహిళ సోదరుడు పూర్తి టీకా తీసుకున్న వారు కావడం గమనార్హం. వీరిని కలిసిన 13 మందిని గుర్తించడం జరిగిందని, వారికి కూడా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
మహిళకు మాత్రం స్వల్ప లక్షణాలుండగా, మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేవని కూడా వారు చెప్పారు. వీరంతా నవంబర్ 24న నైజీరియాలోని లాగోస్‌నుంచి వచ్చారు. అందరికీ పింప్రి చించ్వాడాలోని జిజామాత ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, అందరూ నిలకడగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.. అలాగే ఫిన్లాండ్‌నుంచి పుణె వచ్చిన మరోవ్యక్తిలోనూ ఈ వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
మరో వైపు టాంజానియానుంచి ఢిల్లీ వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. రాంచీలో నివసిస్తున్న ఈ వ్యక్తి వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండడం గమనార్హం. ఢిల్లీ చేరుకున్న తర్వాత రాంచీకి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉన్న ఆ వ్యక్తి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శాంపిల్స్ ఇచ్చినందున అతడ్ని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా ఇప్పటికే కర్నాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, ముంబయిలో మరో కేసు చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ కేసులు పలు రాష్ట్రాలకు విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జనవరి లేదా ఫిబ్రవరిలో థర్డ్‌వేవ్
వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో దేశంలో థర్డ్‌వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఐఐటీ-కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మనీంద్ర అగర్వాల్ చెప్పారు. దేశమంతటా ఈ వేరియంట్ విస్తరించవచ్చన్నారు. ఫిబ్రవరిలో కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకోవచ్చని, అయితే సెకండ్‌వేవ్ అంత తీవ్రత థర్డ్‌వేవ్‌లో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకారి అని, వేగంగా విస్తరిస్తున్నదని పలు వార్తలు వస్తున్నాయని.. అయితే ఈ కొత్త వేరియంట్‌పై ఇప్పుడే మనం ఒక అంచనాకు రావడం సరికాదని అగర్వాల్ తెలిపారు. ‘ఇప్పటికే దేశంలో చాలా మంది వైరస్ బారిన పడి కోలుకున్నారు. దీంతో వారిలో ఇమ్యూనిటీ పెరిగింది. అలాగే ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ రెండు అంశాలను లెక్కల్లోకి తీసుకుంటే భారతీయులపై ఒమిక్రాన్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు’ అని వెల్లడించారు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తే ఒమిక్రాన్‌ను నిలువరించవచ్చని వివరించారు.
డెల్టా వేరియంట్ సోకితే శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడటం, జలుబు చేయడం, ఒళ్లు నొప్పులు, తీవ్ర జర్వం లాంటి లక్షణాలు బయటపడేవి. కానీ ఒమిక్రాన్ లక్షణాలు వీటికి పూర్తి భిన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా తలనొప్పి, తీవ్రమైన అలసట, వెన్ను నొప్పి.. ఈ మూడు లక్షణాలు ఒమిక్రాన్ సోకినవారిలో ఉంటున్నట్టు దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏంజెలిక్ కోయెట్జీ చెప్పారు.
అంతేగాక ఈ వేరియంట్ సోకినవారిలో జ్వరం కనిపించడం లేదని, రుచి, వాసనను కోల్పోవడం లేదని తెలిపారు. అయితే ఒమిక్రాన్ రోగిలో ఇప్పటికీ తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
శబరిమల సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ తొలగింపు
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు