కరీంనగర్‌ వైద్య కళాశాలలో 43 మందికి కరోనా

ఒమైక్రాన్‌ పేరిట కరోనా మూడవ వేవ్‌ ముప్పు ముంచుకొస్తున్నదని ప్రచారం జరుగుతున్న తరుణంలో కరీంనగర్‌ జిల్లాలోని ఒక చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో 43 మంది విద్యార్థులు, సిబ్బందికి వ్యాధి నిర్ధారణ కావడం కలకలం సృష్టిస్తున్నది.
 
గత నెల 27న కళాశాల వార్షికోత్సవం జరుగగా విద్యార్థులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వార్షికోత్సవ సమావేశంతోనే కరోనా వ్యాప్తి జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ నెల 4న కరోనా సోకిందన్న అనుమానంతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఆదివారం మరో 28 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించడంతో పాటు విద్యార్థులందరిని హాస్టల్‌ ఖాళీ చేయాలని మెసేజ్‌లు పంపించింది. 
 
విద్యార్థులు, మెస్‌ సిబ్బంది అందరూ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించుకోవాలని యాజమాన్యం సూచించింది. విద్యార్థులు కళాశాలతోపాటు హాస్పిటల్‌లో కూడా తిరుగుతుంటారని, ఈ నేపథ్యంలో మరి కొందరికి కూడా వ్యాధి వ్యాపించి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. 
ఇదిలా ఉంచితే, తెలంగాణలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా కేసులు లేవని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని తెలిపింది. కాగా, 13 మంది శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్స్‌కు పంపినట్లు స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షల నిమిత్తం పంపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 

రాజేంద్రనగర్ బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని పీరం చెరువులో కరోనా అలజడి సృష్టించిన సంగతి తెలసిందే. స్థానిక గిరిధారి అపార్ట్‌మెంట్‌లో 10 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇటీవల ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అపార్ట్‌మెంట్ వాసికి కరోనా సోకింది. అనంతరం ఆ అపార్ట్‌మెంట్‌లో పలువురికి పరీక్షలు చేయగా మొత్తంగా 10 మందికి కరోనా సోకినట్లు తేలింది.