దేశంలో 50 శాతం మందికి రెండో డోస్ కరోనా టీకాలు !

కరొనపై పోరులో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలో 50శాతం మందికి కొవిడ్‌ టీకాలు వేసినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ తెలిపారు. భారత్‌లో 50శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇచ్చామని, ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. 
 
ఇప్పటి వరకు 1,27,61,83,065 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో 84.4 మంది ఇప్పటి వరకు కనీసం ఒక డోసు తీసుకున్నారని వివరించింది. గత 24 గంటల్లో 1,04,18,707 మందికి టీకాలు వేసినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదవగా.. 2,796 మరణాలు రికార్డయ్యాయి. అయితే, ఇందులో బిహార్‌ ప్రభుత్వం మరణాల సంఖ్యను అప్‌డేట్‌ చేయడంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. బిహార్‌ ప్రభుత్వం ఎట్టకేలకు 2424 మంది కరోనాతో మరణించినట్లు అంగీకరించగా.. ఆ మరణాలను జాబితాలో చేర్చారు.
 
మరోవంక,  కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ భారత్‌ను కలవరపెడుతున్నది. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఢిల్లీలో మరో కేసు వెలుగుచూసింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఐదుకు చేరింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ వైరస్‌ను గుర్తించారు. 
 
పాజిటివ్‌ వచ్చిన మొత్తం 17 మంది ప్రయాణికుల్లో 12 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించామని, అందులో ఒకరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ చెప్పారు. ప్రస్తుతం వారంతా ఎల్‌ఎన్‌జేపీ దవాఖానలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
 కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వం కరోనా  టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఒమిక్రాన్‌ భయాందోళనల మధ్య వందశాతం టీకా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. టీకా తీసుకోకుంటే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కొంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల డైరెక్టర్‌ బీ శ్రీరాములు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.