కేంద్రంతో చర్చలకు ఐదుగురు సభ్యులతో రైతుల కమిటీ

వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత.. అన్నదాతలు చేస్తున్న డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చర్చలకు ఆహ్వానించినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేత రాకేష్‌ తికాయిత్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. 

 రైతు సంఘాల త‌ర‌పున ఈ క‌మిటీ కేంద్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతంది. ఈ క‌మిటీలో యుధ‌వీర్ సింగ్ (యూపీ), శివ‌కుమార్ క‌క్కా (ఎంపీ), బ‌ల్బీర్ ర‌జేవాల్ (పంజాబ్‌), అశోక్ ధ‌వ‌లే (మ‌హారాష్ట్ర‌), గుర్నాం సింగ్ చ‌ధౌని (హ‌ర్యానా) స‌భ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ కేంద్రంతో చర్చలు జరుపుతుందని, ఒక వేళ చర్చలు సఫలీకృతమైతే.. ఉద్యమాన్ని ఆపేస్తామని తికాయిత్‌  తెలిపారు. కనీస మద్దతు ధర, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేత, ఢిల్లీ శివార్లలో చేపట్టిన ఉద్యమంలో అశువులు బాసిన 702 మంది అన్నదాతల కుటుంబాలకు పరిహారం అందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

కాగా, ఎస్‌కేఎం డిసెంబ‌ర్ 7న స‌మావేశ‌మై త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను నిర్ణ‌యిస్తుంద‌ని క‌మిటీ స‌భ్యుడు, ఆల్ ఇండియా కిసాన్ స‌భ అధ్య‌క్షుడు అశోక్ ధ‌వ‌లే వెల్ల‌డించారు.