పరిష్కారాల కోసం భారత్ వైపు చూస్తున్న ప్రపంచం

పరిష్కారాల కోసం ప్రపంచం భారతదేశం వైపు అంతకంతకూ చూస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. నాగ్‌పూర్‌లో దత్తా మేఘే ఫౌండేషన్ ఆధ్వర్యంలోని పశువైద్య, వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో గురువారం భగవత్ మాట్లాడుతూ, “పరిష్కారాల కోసం ప్రపంచం అంతకంతకూ భారతదేశం వైపు చూస్తోందని, ఈ నేపథ్యంలో తన సాంప్రదాయిక జ్ఞానం, అనుభవాన్ని ఉపయోగించుకుని ప్రపంచానికి ఒక నూతన అభివృద్ధి నమూనాను అందించగలదని” చెప్పారు. 
 
“మానవ శ్రేయస్సు కోసం జీవవైవిధ్యం, జీవావరణ శాస్త్రం, జంతు ఆరోగ్యం,  పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం” అని భగవత్ పేర్కొన్నారు. కేవలం తన శ్రేయస్సు కోసమే కాకుండా, అందరి శ్రేయస్సును నిర్ధారించే జీవనశైలి అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
 
“మన జీవిత దృక్పథం కేవలం నా జీవితానికి సంబంధించినదిగా కాకుండా, ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించినదిగా ఉండాలి” అని ఆయన అన్నారు. దీనిని ఆంగ్లంలో “వన్ హెల్త్” (ఒకే ఆరోగ్యం) అని అంటారు. ఈ పదం, దాని వెనుక ఉన్న భావన గత 20-30 సంవత్సరాలలో ఆధునిక ప్రపంచంలో ఉద్భవించాయి. అయితే, భారతదేశంలో ఈ ఆలోచన శతాబ్దాలుగా ఉంది—ఇది ఒక ఆంగ్ల పదం ద్వారా కాకుండా, మన ప్రాచీన జీవనశైలి, సంప్రదాయాల ద్వారా వచ్చింది” అని భగవత్ వివరించారు. 
 
“పర్యావరణం ఆరోగ్యంగా లేకపోతే, మనం కూడా ఆరోగ్యంగా ఉండలేము. అదేవిధంగా, జంతువుల ఆరోగ్యం క్షీణించినప్పుడు, అది కేవలం వాటి ఉత్పాదకతను మాత్రమే ప్రభావితం చేయదు. వ్యాధులు జంతువుల నుండి మానవులకు కూడా వ్యాపించగలవు. విజ్ఞాన శాస్త్రంలో, ఈ ప్రక్రియను ‘జూనోసిస్’ (జంతుజన్మల ద్వారా సంక్రమించే వ్యాధులు) అని అంటారు. ఒకవేళ మానవులే ఆరోగ్యంగా లేక, పర్యావరణం, జంతురాజ్యం ప్రాముఖ్యతను గ్రహించడంలో విఫలమైతే—మొత్తం సృష్టి ప్రమాదంలో పడవచ్చు,” అని హెచ్చరించారు. 
 
ఆధునిక ప్రపంచం ఈ సత్యాన్ని తన సొంత అనుభవాల ద్వారా గ్రహిస్తున్నప్పటికీ, భారతదేశంలో ఈ అవగాహన ప్రాచీన కాలం నుంచే ఉందని పేర్కొంటూ అందుకే మన సంప్రదాయాలు, పండుగలు కూడా ప్రకృతి, జంతువుల పట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. “గోవు ఆరాధనకు అంకితమైన గోవత్స ద్వాదశితో ప్రారంభమయ్యే దీపావళిని మనం ఇటీవల జరుపుకున్నాము. గోవర్ధన పూజ సమయంలో ఆవు పేడకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. నేడు ప్రపంచం కూడా ఆవు పేడ ఉపయోగితను, ప్రాముఖ్యతను గుర్తించడం మొదలుపెట్టింది,” అని ఆయన తెలిపారు. 
 
భారతదేశ దృక్పథం ఎల్లప్పుడూ సమగ్రమైనది, సంపూర్ణమైనది అని స్పష్టం చేశారు. మన దేశం అత్యంత ప్రాచీనమైనది, ఇక్కడ జీవన అనుభవాలు కూడా అంతే పురాతనమైనవి. ఎంతో కాలం క్రితమే, నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, అనుభవాల నుండే పాఠాలు నేర్చుకున్న మన పూర్వీకులు, ఒక ప్రత్యేక జీవన విధానాన్ని రూపొందించుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు, ఆ జీవన విధానం ప్రాముఖ్యతను ప్రపంచం క్రమంగా అర్థం చేసుకుంటోందని తెలిపారు. 
 
‘వన్ హెల్త్’ (ఒకే ఆరోగ్యం) భావన దీనికి ఒక ఉదాహరణ అని చెబుతూ ఇప్పటివరకు, ప్రకృతిపై మానవులే యజమానులని, కాబట్టి వారు ప్రకృతిని తమకు నచ్చినట్లుగా వాడుకోవచ్చనే దృక్పథం ప్రపంచవ్యాప్తంగా ఉండేదని డా. భగవత్ చెప్పారు. అయితే, మనం ప్రకృతికి యజమానులం కాదని, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో మనం కూడా ఒక భాగమేననే అవగాహన ఇప్పుడు కలుగుతోందని తెలిపారు. మనమందరం ప్రకృతిపై, అలాగే ఒకరిపై ఒకరం ఆధారపడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

About The Author