బెంగ‌ళూరులో 10 మంది ద‌క్షిణాఫ్రికా వాసులు అదృశ్యం

భారత్ లో  తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రిలో ఒక‌రి వ‌య‌సు 66 కాగా, మ‌రొక‌రి వ‌య‌సు 46 అని అధికారులు పేర్కొన్నారు. తాజాగా,  గుజ‌రాత్‌లో మ‌రో వ్య‌క్తికి ఒమిక్రాన్ పాజిటివ్ వ‌చ్చింది. సౌతాఫ్రికా నుంచి గుజ‌రాత్‌కు వచ్చిన ఓ వ్య‌క్తిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. దాంతో దేశంలో డేంజ‌ర‌స్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది.
అయితే న‌వంబ‌ర్ 12 నుంచి 22వ తేదీ మ‌ధ్య‌లో బెంగ‌ళూరుకు వ‌చ్చిన 10 మంది ద‌క్షిణాఫ్రికా వాసులు అదృశ్య‌మ‌య్యారు. వీరి ఆచూకీ కనుగొనేందుకు క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.  ఇలా ఆఫ్రికా దేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన పది మంది ఎక్కడుందీ తెలియడం లేదని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక తెలిపారు. ఈ పదిమంది కూడా ఎయిర్‌పోర్టులో ఇచ్చిన అడ్రస్‌లలో లేరని, మొబైల్స్ కూడా స్విచాఫ్ వస్తున్నాయని ఆయన వెల్లడించారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

ఈ వ్య‌క్తుల‌ను క‌నుగోనేందుకు ఆరోగ్య శాఖ అధికారులు.. పోలీసుల స‌హ‌కారం తీసుకుంటున్నారు. న‌వంబ‌ర్ 22వ తేదీ నుంచి అన్ని ఎయిర్‌పోర్టుల్లో అధికారులు నిఘా పెట్టారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించిన దేశాల నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో కర్నాటక రాజధాని బెంగళూరుతో పాటుగా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఆంక్షలను కఠినతరం చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్రాంతాల్లో జర్మన్ మోడల్‌ను అనుసరించనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ తాజా గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది.

జర్మన్ మోడల్ అంటే టీకా వేసుకోని వారిపై బహిరంగ ప్రదేశాల్లోకి రాకుండా నిషేధం ఉం టుంది. శుక్రవారంనుంచి బెంగళూరులో కూడా రెండు డోసులు తీసుకోని వారిని అనుమతించరు. పూర్తి వ్యాక్సిన్‌ను తీసుకోని వారిని షాపింగ్ మాల్స్. సినిమా థియేటర్లలోకి అనుమతించరని సమావేశానికి హాజరైన రెవిన్యూ మంత్రి ఆర్ అశోక్ చెప్పారు.

అంతేకాదు తల్లిదండ్రులు పూర్తి వ్యాక్సిన్ తీసుకోకపోతే వారి పిల్లలను పాఠశాలల్లో అఫ్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి అనుమతించరు. ఒమిక్రాన్ దృష్టా వచ్చే జనవరి 15 దాకా అన్ని సాంస్కృతిక కార్యకలాపాలను వాయిదా వేసుకోవాలని పాఠశాలలను ఆదేశించారు.

కాగా ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్  చికిత్స పొందుతున్న క‌రోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిన‌ట్లు అనుమానిస్తున్నార‌ని తెలుస్తున్నదిఈ ఆసుపత్రిలో  గురువారం 8 మంది ఒమిక్రాన్ అనుమానితులు చేర‌గా, ఇవాళ మ‌రో న‌లుగురు అనుమానితులు చేరిన‌ట్లు తెలిసింది.

ఇవాళ ఆస్ప‌త్రిలో చేరిన న‌లుగురిలో ఇద్ద‌రు యూకేకు చెందిన‌వారు కాగా, ఒక‌రు ఫ్రాన్స్‌కు, ఇంకొక‌రు నెద‌ర్లాండ్స్‌కు చెందిన వార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెప్పాయి. బాధితుల శాంపిల్స్‌ను ఒమిక్రాన్ నిర్ధార‌ణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించిన‌ట్లు తెలిసింది.

ఇలా ఉండగా,  క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళ‌న నేప‌థ్యంలో .. 40 ఏళ్ల వ‌య‌సు దాటిన వారికి బూస్ట‌ర్ డోసు టీకాలు ఇవ్వాల‌ని జీనోమ్ ప‌రిశోధ‌నల‌ గ్రూపు ఇన్‌సాకాగ్ కేంద్రానికి సూచించింది. క‌రోనా వైర‌స్‌లో జ‌రుగుతున్న జ‌న్యు ప‌రిణామాల‌ను ప‌రిశీలిచేందుకు 28 ప‌రిశోధ‌న‌శాల‌ల‌తో కూడిన‌ క‌న్సార్టియం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. 

 వ్యాక్సిన్ వేసుకోని వారికి ముందుగా టీకాలు ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత 40 ఏళ్లు ఉన్న‌వాళ్ల‌కు, దాటిన‌వాళ్ల‌కు కోవిడ్ బూస్ట‌ర్ డోసు టీకాలు ఇవ్వాల‌ని ఇన్‌సాకాగ్ తెలిపింది. ఎక్కువ రిస్క్ ఉన్న‌వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని, ఇప్పుడున్న వ్యాక్సిన్ల‌లో త‌క్కువ స్థాయి యాంటీబాడీలు ఉన్నాయ‌ని, వాటితో ఒమిక్రాన్‌ను నిర్వీర్యం చేయ‌డం కుద‌ర‌ద‌ని, అందుకే బూస్ట‌ర్ డోసు త‌ప్ప‌నిస‌రి అని ఇన్‌సాకాగ్ తెలిపింది.