అధికారిక ట్విట్టర్ నుండే ఇమ్రాన్ ఖాన్ పై పేరడీ వీడియో! 

తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రభుత్వంలోనే వారే ఇమ్రాన్ ఖాన్ పాలన పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా ప్రభుత్వం ఉద్యోగాలకు జీతాలు కూడా ఇవ్వలేక పోవడంతో ప్రభుత్వంపై తిరుగుబాటు అనివార్యంగా కనిపిస్తున్నది. తాజాగా ప్రభుత్వంకు చెందిన ఒక రాయబారి కార్యాలయం అధికారిక ట్విట్టర్ నుండే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపిస్తూ పేరడీ వీడియో ప్రచారం కావడం కలకలం రేపుతున్నది. 

ఇమ్రాన్ ఖాన్ వైఫల్యాలను ఎండగడతూ రూపొందిచిన ఈ  పెరడీ వీడియో పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను సెర్బియాలోని పాకిస్తాన్‌ రాయబార కార్యాలయం తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోని ట్విటర్‌లో షేర్‌ చేసిన కాసేపటికే ఇది తెగ వైరలయ్యింది. దాంతో అధికారుల స్పందించారు. ట్విటర్‌ నుంచి వీడియోని తొలగించారు. అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని ఓ ప్రకటన చేశారు.

‘‘ద్రవ్యోల్భణంలో పాకిస్తాన్‌ గత రికార్డులను బద్దలు కొట్టింది. ఇమ్రాన్‌ ఖాన్‌.. మీరు ఇంకేత కాలం ప్రభుత్వ అధికారులు నోరు మెదపకుండా.. మీ కోసం పని చేయాలని ఆశిస్తున్నారు. గత మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఫీజు కట్టకపోవడంతో మా పిల్లలను పాఠశాల నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇంకెంత కాలం మొద్దు నిద్ర నటిస్తారు.. ఇదేనా కొత్త పాకిస్తాన్‌’’ అనే క్యాప్షన్‌తో పెరడీ పాట వీడియోను షేర్‌ చేశారు. 

ఇక దీనిలో ఓ వ్యక్తి.. ‘‘సబ్బు ధర పెరిగిందా.. వాడకండి.. పిండి ఖరీదు ఎక్కువగా ఉందా.. తినకండి.. మందుల ధరలు పెరిగాయా.. అయితే ఆస్పత్రులకు వెళ్లకండి.. మీరు కేవలం పన్నుల చెల్లించి.. హాయిగా నిద్రపోండి. మీ పిల్లలకు తిండి, తిప్పలు, చదువు లేకపోయినా పర్వాలేదు. పాకిస్తాన్‌ ఎప్పటికి మేల్కొదు’’ అని సాగుతూ ఉంటుంది. 

ఇక ప్రతి వైఫల్యం దగ్గర ఇమ్రాన్‌ ఖాన్‌ గతంలో చెప్పిన డైలాడ్‌ ‘కంగారు పడకండి’ అని వస్తుంది. అంటే తిండి లేకపోయినా సరే కంగారు పడకండి అని సాగుతుంది ఈ పాట. ‘‘సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఈ ఖాతాలలో పోస్ట్ చేసిన సందేశాలు సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి వచ్చినవి కావు’’ అని ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ఉంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ప్రపంచదేశాల భావిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు. మరోవైపు డ్రాగన్‌ తన స్వార్థ ప్రయోజనాల కోసం పాక్‌కు రుణం ఇస్తోంది కానీ, అవి ఆ దేశ అవసరాలను తీర్చడం లేదు.