23 దేశాల్లో ఓమిక్రాన్ కేసులుఅమెరికాలో తొలి కేసు

ఇప్పటికే ఓమిక్రాన్ కేసులు 23 దేశాల్లో బ‌య‌ట‌ప‌డగా, ఈ సంఖ్యా రోజురోజుకు పెరుగుతున్నది. దానితో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కరోనా కేసు నమోదైంది. అంతకు ముందు  జపాన్ లో  ఓమిక్రాన్ కేసు బ‌య‌ట‌ప‌డింది. 

అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదయింది. గతనెల 22న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజటివ్‌ వచ్చిందని, అతనిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైట్‌హౌజ్‌ వర్గాలు ప్రకటించాయి. ఆ వ్యక్తి నవంబర్‌ 22న దక్షిణాఫ్రికా నుంచి కాలిఫోర్నియాకు (California) వచ్చాడని, అదేనెల 29న అతనికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు తెలిపారు. అతడు కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాడని వెల్లడించారు. అతని సంబంధీకును పరీక్షించామని, వారికి నెగెటివ్‌ వచ్చిందని ప్రకటించారు.

ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బోట్స్వానా, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, హాంకాంగ్, ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, నైజీరియా, పోర్చుగల్, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, యూకే దేశాలకు ప్రస్తుతం విస్తరించింది.  

దాంతో ప‌లు దేశాల స‌రిహ‌ద్దుల‌ని మూసివేసి, విమానాలను కూడా ర‌ద్దు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యం వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్‌గా ఉన్న డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్‌ ఆక్రమించే ప్రమాదం ఉందని, డెల్టాను దాటేసే అవకాశం ఉందని దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్‌ఐసీడీ) పరిశోధకులు హెచ్చరించారు. 

ఎన్‌ఐసీడీకి చెందిన ఆడ్రియన్ పురెన్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ ఇమ్యూనిటీని ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఏ రేంజ్‌లో తప్పించుకోగలుగుతుంది? అనే విషయాన్ని నాలుగు వారాల్లోగా తెలుసుకోవాలని సూచించారు. విపరీతంగా మ్యుటేట్‌ అయిన ఒమిక్రాన్‌ వేరియంట్ చాలా ప్రమాదకారి అని, అంతర్జాతీయంగా దీనివల్ల చాలా రిస్క్ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇటీవలే హెచ్చరికలు చేసింది.