ఏపీ వైపున‌కు దూసుకొస్తున్న మరో తుఫాన్ జవాద్‌!

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఏపీ తీరంవైపున‌కు దూసుకొస్తున్న వాయగుండం తుపానుగా మారనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం తుపానుగా మారితే జవాద్‌గా నామకరణం చేయనున్నారు. సౌదీ అరేబియా ఈ పేరును సూచించింది.

ఏపీపై వరుణుడి ప్రతాపం ఇంకా కొనసాగుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే అల్లకల్లోలమయ్యాయి. నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ మూడు జిల్లాల్లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు మరో తుపాను ముప్పు వెంటాడుతోంది.

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా థాయ్‌లాండ్ సమీపంలో ఏల్పడిన అల్పపీడనం గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుందని అటు వాతావరణ శాఖ, ఇటు స్కైమెట్ అంచనా వేశాయి. ఈ వాయుగుండం ఏపీ తీరంవైపుకు దూసుకొస్తోందని ఐఎండీ తాజాగా హెచ్చరించింది.

డిసెంబర్ 3వ తేదీ నాటికి మరింతగా బలపడి, తుపానుగా మారవచ్చని అంచనా. క్రమంగా వాయువ్య దిశగా పయనిస్తూ..డిసెంబర్ 4వ తేదీ నాటికి ఏపీ, ఒడిశా రాష్ట్రాల మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.

తుపాను ప్రభావం ఏపీతో పాటు ఒడిశాపై ఉండనుంది. తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

దీనివల్ల పంటలకు భారీనష్టం కలిగించవచ్చని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. రైతులు పొలాల్లో ఉన్న మొక్కజొన్నను కోయాలని బెంగాల్ సర్కారు సూచించింది. కోల్‌కతా, దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్, హౌరా, హుగ్లీ, నదియాతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డిసెంబర్ 4,5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.