భారత్ లో ఒమిక్రాన్ కేసు న‌మోదు కాలేదు

భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ వేరియంట్ కేసు న‌మోదు కాలేద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ స్పష్టం చేశారు. ఇవాళ రాజ్య‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయ‌న మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

విమానాశ్ర‌యాల వ‌ద్ద స్క్రీనింగ్ చేస్తున్నామ‌ని, పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపులో భాగంగా టెస్టింగ్‌ను పెంచాల‌ని అన్ని రాష్ట్రాల‌ను ఆదేశించిన‌ట్లు మంత్రి చెప్పారు. ఒమిక్రాన్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా హై రిస్క్ ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 

కొత్త వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆర్‌టీ పీసీఆర్‌, యాంటీజెన్ ప‌రీక్ష‌ల్లోనూ ఒమిక్రాన్‌ను గుర్తించ‌వ‌చ్చు అని ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.  ద‌క్షిణాఫ్రికాలో తొలుత క‌నిపించిన ఈ వేరియంట్ ఇప్పుడు ప‌లు దేశాల్లో విజృంభిస్తోంది.

క‌రోనా మ‌హ‌మ్మారి వేళ టీబీ వ్యాధి టెస్టింగ్‌పై ప్ర‌భావం ప‌డిందా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ నిజానికి టీబీ వ్యాధిగ్ర‌స్తుల గుర్తింపు స్వ‌ల్పంగా త‌గ్గింద‌ని, కానీ దాన్ని మ‌ళ్లీ రెట్టింపు చేయ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 2025 వ‌ర‌కు దేశం నుంచి క్ష‌య వ్యాధిని నిర్మూలించాల‌న్న సంక‌ల్పంతో కేంద్ర ప్ర‌భుత్వం ఉంద‌ని పేర్కొన్నారు. కోవిన్ యాప్ త‌ర‌హాలో టీబీ కోసం ఓ యాప్‌ను రూపొందించాల‌ని ఎంపీ రూపా గంగూలీ డిమాండ్ చేశారు.

ఇలా ఉండగా,  కరోనా వైరస్‌ను గుర్తించడానికి చేసే ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్ యాంటీజెన్‌ టెస్టులు ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌పై కూడా పనిచేస్తాయని  కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్   చెప్పారు. వీటిలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా బయటపడుతుందని, ఈ వేరియంట్ టెస్టులను తప్పించుకోలేదని స్పష్టం చేశారు.

ఒమిక్రాన్‌పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు.ఈ కరోనా వేరియంట్‌ పూర్తిగా వ్యాపించక ముందే తొందరగా గుర్తిస్తే మంచిదని చెప్పారు. కావున రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని చెప్పారు.