పార్లమెంటులో బిల్లులపై చర్చించేందుకు ముందుకు రండి 

పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చించేందుకు ముందుకు రావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని, ఇతర ప్రతిపక్ష నేతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ కోరారు. పార్లమెంటులో చర్చ జరగాలని తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన రాజ్యసభ సభ్యులు కూడా చర్చలో పాల్గొనాలని కోరుకుంటే, వారు ముందుగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. 

పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని వారిని కోరుతున్నానని ఆయన చెప్పారు. చర్చ జరగాలని తాము కూడా కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ‘‘సభకు వచ్చి, చర్చలో పాల్గొనాలని ప్రతిపక్ష నేతలను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ప్రహ్లాద్ జోషీ తెలిపారు. 

ఇదిలావుండగా, సస్పెన్షన్‌కు గురైన 12 మంది రాజ్యసభ సభ్యులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వీరిపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. 

కాంగ్రెస్ నేత మనీష్ తివారీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అత్యధిక ద్రవ్యోల్బణం రేటు, వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడంపై చర్చ జరపాలని కోరారు. అయితే ప్రతిపక్ష సభ్యుల గందరగోళ మధ్య రాజ్యసభ మధ్యాహ్నంకు వాయిదా పడింది. కాంగ్రెస్ నేత, లోక్‌సభ సభ్యుడు మాణిక్కం టాగూర్ కూడా ఓ నోటీసు ఇచ్చారు. కరోనా  బాధితులకు నష్టపరిహారంపై చర్చించాలని కోరారు. కరోనా  మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన, ఆర్థిక సాయం అవసరమైనవారికి రూ.4 లక్షలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. 

కాగా, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధ హామీ ఇవ్వడంపై చర్చించాలని రాజ్యసభ సభ్యుడు దీపేందర్ సింగ్ కోరారు. ఓ సంవత్సరం నుంచి జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ అంశాలపై చర్చ కోసం సస్పెన్షన్ ఆఫ్ బిజినెస్ నోటీసు ఇచ్చారు.