ముంబై దాడుల‌కు 13 ఏళ్లు.. పాక్ దౌత్యవేత్త‌కు స‌మ‌న్లు

2008, సెప్టెంబ‌ర్ 26వ తేదీన ముంబైలో ఉగ్ర‌వాదులు ర‌క్త‌పాతం సృష్టించిన విష‌యం తెలిసిదే. ఆ దాడుల‌కు నేటితో 13 ఏళ్లు నిండాయి. ఆ ఘాతుకానికి పాల్ప‌డిన ఉగ్ర‌వాదులను ప‌ట్టుకోవాల‌ని ఇవాళ పాకిస్థాన్‌ను భారత్ కోరింది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ హై క‌మిష‌న్‌లో ప‌నిచేస్తున్న సీనియర్ దౌత్య‌వేత్త‌కు స‌మ‌న్లు జారీ చేసింది. 

26/11 ముంబై దాడులకు సంబంధించిన కేసును త్వ‌ర‌గా విచారించాల‌ని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. ముంబై దాడులు జ‌రిగే 13 ఏళ్లు గ‌డిచినా.. 166 మంది బాధిత కుటుంబాలు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు భార‌త ప్ర‌భుత్వం చెప్పింది. ఇవాళ కేంద్ర విదేశాంగ‌శాఖ ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్‌కు స‌మ‌న్లు జారీ చేసింది.

ఈ విషయమై ద్వంద్వ ప్రమాణాలను విడిచిపెట్టాలని విదేశాంగ వ్యవహారాల శాఖ పాకిస్తాన్‌ కు హితవు చెప్పింది. బాధితులకు నివాళులు అర్పించడంతో పాటు స్మారక కార్యక్రమాలను చేపట్టడంతోపాటు ప్రపంచంపై ఉగ్రవాద ముప్పును గుర్తు చేస్తుందని ఎంఇఎ ఆ ప్రకటనలో పేర్కొంది. 

ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డిన వారిని శిక్షించ‌డంలో పాకిస్థాన్ నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు భార‌త విదేశాంగ శాఖ ఆరోపించింది. ద్వంద్వ వైఖ‌రిని పాకిస్థాన్ వీడాల‌ని భార‌త్ కోరింది. 26/11 ముంబై దాడుల దోషుల్ని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేసింది. ముంబై దాడుల బాధితులు, అమ‌రులకు న్యాయం చేకూరే వ‌ర‌కు భార‌త్ ప్ర‌తి ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగిస్తున్నంద‌ని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ నియంత్రణలో ఉన్న భూభాగాల్లో కూడా ఉగ్రవాదాన్ని అనుమతించకూడదనే నిబద్ధతకు కట్టుబడి ఉండాలని పాకిస్తాన్‌ను భారత్ హెచ్చరించింది. 26/11 ఉగ్రదాడులు ప్రణాళిక ప్రకారం జరిగిన దాడులని, వీటికి వ్యూహరచన చేసింది, దాడులు చేసింది కూడా పాకిస్తాన్‌ ఉగ్రవాదులేనని ఎంఇఎ తన ప్రకటనలో మరోసారి స్పష్టం చేసింది. 

కాగా, 13 ఏళ్ల క్రితం నవంబర్‌ 26న ఉగ్రవాదులు ఛత్రపతి శివాజి మహరాజ్‌ టెర్మినస్‌, తాజ్‌హోటల్‌, హోటల్‌ త్రిడెంట్‌, నారిమన్‌ హౌస్‌, లియోపోల్డ్‌ కేఫ్‌లపై బాంబు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగిన ఈ దాడుల్లో 166 మంది మరణించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో తొమ్మిదిమందిని సైనికులు కాల్చిచంపారు. ఈ దాడులకు సూత్రధారి అయిన అజ్మల్‌ కసబ్‌ను తదుపరి ఉరితీశారు.