హోర్డింగ్‌లపై భగవత్‌ ఫొటోతో వివాదం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్ సంఘచాలక్ డా.  మోహన్‌ భగవత్‌ ఫొటోను ప్రకటనల హోర్డింగ్‌లపై వినియోగించడం వివాదానికి దారి తీసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా చీఫ్‌ ఫిర్యాదు నేపథ్యంలో యాడ్‌ ఏజెన్సీ యజమానిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. 

యాడ్‌ ఏజెన్సీ యజమాని సత్యప్రకాష్ రేషుపై జిల్లా ఆర్ఎస్ఎస్ చీఫ్ సురేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన అడ్వర్టైజింగ్ కంపెనీ అనుమతి లేకుండా భగవత్ ఫొటోను హోర్డింగ్‌లపై ఉపయోగిస్తోందని, ఇది సమాజంలో సంస్థ గురించి తప్పుడు సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు.

కాగా, యాడ్‌ ఏజెన్సీ యజమాని సత్యప్రకాష్ దీనిపై వివరణ ఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ తనకు స్పూర్తి అని త్లెఇపారు. కొంత పరిశోధన తర్వాత ఎన్నికల్లో 40 శాతం మంది ఓటు వేయడం లేదని గుర్తించినట్లు చెప్పారు. అందువల్ల ప్రజలను ఓటు వేయమని ఎలా ప్రోత్సహించవచ్చో అన్నది హోర్డింగ్‌ల ద్వారా సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఫొటో వాడినట్లు చెప్పారు. అయితే రాజకీయాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. హోర్డింగ్‌లపై మోహన్‌ భగవత్‌ ఫొటో వినియోగంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ, జిల్లా స్థాయి నాయకులతో మాట్లాడినట్లు సత్యప్రకాష్ తెలిపారు. అభ్యంతరం వచ్చిన తర్వాత అన్ని హోర్డింగ్‌ల నుండి భగవత్ ఫొటోను తొలగించినట్లు చెప్పారు.