త్రిపురలో తృణమూల్ యూత్ అధ్యక్షురాలు అరెస్ట్ 

తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సయోని ఘోష్‌ను త్రిపుర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఆమెను హత్యాయత్నం నేరం కింద అరెస్ట్‌ చేసినట్లు పశ్చిమ త్రిపుర అదనపు ఎస్పీ(అర్బన్) బీ జగదేశ్ రెడ్డి తెలిపారు. 

ఆమె తన కారుతో బీజేపీ కార్యకర్తలను తొక్కి చంపేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు రావడంతో, విచారణకోసం ఆమెను పిలిపించామని,  అందుకు ప్రాధమిక ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్ట్ చేశామని వివరించారు. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. 

ఆ సమయంలో ఆమె కారులో మరో నలుగురు ఉన్నట్లు తేలినదని, వారికోసం కూడా అన్వేషిస్తున్నామని చెప్పారు. అయితే  త్రిపుర పోలీసులు తనపై హత్యాయత్నం కేసు మోపడాన్ని సయోని ఘోష్ ఖండించారు. బీజేపీ సమావేశం జరిగే చోట కారులో వెళ్తున్న వీడియోను ఆమె ట్వీట్‌ చేశారు. 

అక్కడ త్రిపుర సిఎం బిప్లబ్ దేబ్ ప్రసంగిస్తుండగా సభలో పెద్దగా జనం లేకపోవడంపై సయోని ఎగతాళి చేసినట్లు అందులో ఉన్నది. ఒక వ్యక్తి ఆమెను గుర్తించగా ‘ఖేలా హోబ్’ అని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆమె కారు వెంటపడ్డారు.

అయితే, కారుతో తొక్కించి తమను హత్య చేసేందుకు యత్నించారని సయోని ఘోష్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో టీఎంసీ సభ్యులతోపాటు హాటల్‌లో ఉన్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. హాటల్‌ వద్ద సుస్మితా దేవ్ కారును సీజ్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆమె అభ్యంతరం తెలిపారు.

మరోవైపు హెల్మెట్లు ధరించిన బీజేపీ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి టీఎంసీ కార్యకర్తలపై దాడి చేశారని, ఈ ఘటనలో కొందరు టీఎంసీ కార్యకర్తలు గాయపడ్డారని ఆరోపిస్తూ ఓ  వీడియోను సామాజిక మాధ్యమాల్లో టీఎంసీ నేతలు షేర్‌ చేశారు.

త్రిపురలో అరెస్టైన కార్యకర్తలకు అండగా ఉండేందుకు టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఆదివారం అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా విమానం ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన అక్కడకు వెళ్తారని టీఎంసీ పేర్కొంది.