జాదవ్ కు అప్పీల్ చేసుకొనే హక్కు కల్పించిన పాక్ 

పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి, 50 ఏండ్ల కులభూషణ్ జాదవ్‌కు మరింత ఊరట లభించింది. ఆయన అప్పీలు చేసుకునేందుకు హక్కు కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు పాకిస్థాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. 

‘పాకిస్థాన్‌ పార్లమెంట్ ఉమ్మడి సెషన్ మూడు ముఖ్యమైన బిల్లులను ఆమోదించింది. అప్పీల్ చేసుకునే హక్కును కులభూషణ్ జాదవ్‌కు కల్పించే బిల్లు కూడా ఇందులో ఉన్నది’ అని పాక్ మీడియా పేర్కొంది.

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్‌ను కిడ్నాప్‌ చేసిన పాకిస్థాన్‌, ఆయనపై గూఢచర్యం, ఉగ్రవాదం వంటి ఆరోపణలు మోపింది. 2017 ఏప్రిల్‌లో పాక్‌ ఆర్మీ కోర్టు జాదవ్‌కు మరణ శిక్ష విధించగా, భారత్‌ దీనిని అంతర్జాతీయ కోర్టు (ఐసీజే)లో సవాల్‌ చేసింది. జాదవ్‌ను కలిసేందుకు దౌత్య అధికారులను పాక్‌ అనుమతించడం లేదని ఆరోపించింది.

ఇరు దేశాల వాదనలు విన్న ఐసీజే 2019లో భారత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జాదవ్‌కు విధించిన మరణ శిక్షపై పునరాలోచించడంతోపాటు సమీక్షించాలని తెలిపింది. మరణ శిక్షపై జాదవ్‌ అపీల్‌ కోసం ఆయనను కలిసేందుకు భారత దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది.

దీంతో గత ఏడాది ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీలో ఒక ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నినాదాలు, అభ్యంతరాల నడుమ పాక్‌ పార్లమెంట్‌ జాయింట్‌ సెషన్‌లో ఈ బిల్లు ఆమోదం పొందింది.