క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై త్వరలో నిషేధం?

క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, చెల్లింపులపై త్వరలో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.  అయితే బంగారం, షేర్లు లేదా బాండ్ల రూపంలో సంపదగా నిల్వ చేసుకోవడానికి అనుమతించవచ్చు. క్రిప్టో కంపెనీలు, ఎక్స్ఛేంజిలను పూర్తిగా నిలిపేయవచ్చు.  
కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించే వేదికలుగా ఇవి పని చేయకుండా నిరోధించవచ్చు.
దీనికి సంబంధించిన బిల్లు తుది దశలో ఉన్నట్లు,  వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం క్రిప్టోకరెన్సీపై పూర్తిగా నిషేధం విధించకుండా, వాటి రూపంలో చెల్లింపులు, లావాదేవీలను నిషేధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. బంగారం, షేర్లు లేదా బాండ్ల రూపంలో ఆస్తిగా ఉంచుకోవడానికి అవకాశం కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలావుండగా క్రిప్టో కమ్యూనిటీ ఇప్పటికే దీనిని కరెన్సీగా కాకుండా ఆస్తిగానే పరిగణించాలని భారత ప్రభుత్వాన్ని అనేకసార్లు కోరింది. దీనికి అనుమతులు లభించడానికి, నిషేధం నుంచి తప్పించుకోవడానికి ఈ విజ్ఞప్తి చేసింది. క్రిప్టోకరెన్సీల భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత వారం ఓ సమావేశం జరిగింది. 

ముందస్తు చర్యలను తీసుకోవాలనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైందని తెలుస్తోంది. నియంత్రణ లేని క్రిప్టో మార్కెట్లు మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్ అడ్డాలుగా మారే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 

మరోవంక, కర్ణాటక రాజకీయాలలో క్రిస్టో కరెన్సీ ప్రకంపనాలు సృష్టిస్తున్నది.  విధానపరిషత్‌ ఎన్నికలవేళ బిట్‌ కాయిన్‌ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్‌లు సామాన్యులను దోచుకుంటూ ఉండడాన్ని గమనించి వాటికి బ్రేక్‌ వేసిన రాష్ట్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ ముసుగులో జరుగుతున్న వ్యవహారాలను ఏ విధంగా నియంత్రిస్తుందనే అంశంపై సర్వత్రా కుతూహలం నెలకొని ఉంది.

బిట్‌ కాయిన్‌లో ఒకవేళ అక్రమాలు జరిగిఉంటే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్‌ సహితం బిట్‌ కాయిన్‌ వ్యవహారంలో బీజేపీ నేతలు పాల్గొన్న ఆధారాలు ఉంటే విడుదల చేయాలని కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరారు.