
త్రివిధ దళాల అవసరాల కోసం చిరకాల స్వప్నంగా ప్రతిపాదనలో ఉన్న 30 బహుళ సామర్ధ సాయుధ నిఘా డ్రోన్ల (ప్రిడేటర్ డ్రోన్లు)ను 3 బిలియన్ డాలర్లు (రూ.22,000 కోట్లు)తో అమెరికా నుంచి కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ ప్రతిపాదన ప్రకారం సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించగల గగనతలం నుంచి నేలపై లక్షాన్ని ఛేదించగల క్షిపణులతో కూడిన ఎంక్యు9బి డ్రోన్లు సమకూరతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
భద్రతావ్యవహారాలకు సంబంధించి ప్రధాని నేతృత్వం లోని కేబినెట్ కమిటీ ఆమోదించిన తరువాత డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) ఈ కొనుగోలకు కొన్నివారాల్లో గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందని తెలిపాయి. వ్యయభాగం, ఆయుధ ప్యాకేజీ తదితర కీలకాంశాలు అన్నీ పరిష్కారమయ్యాయనీ, ఈ భారీ ఒప్పందం అమెరికాతో ఈ ఆర్థిక సంవత్సరం లోనే కుదురుతుందని అధికార వర్గాలు చెప్పాయి.
త్వరలోనే ఈ ప్రతిపాదన డిఎసి ముందుకు వస్తుందని నావికాదళం వైస్‌చీఫ్ వెల్లడించారు. భారత నావికాదళంతోపాటు మొత్తం త్రివిధ దళాలు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఒక్కో దళానికి 10 డ్రోన్లు వంతున అందుతాయి. రిమోట్ పైలట్‌తో పనిచేసే ఈ మానవ రహిత డ్రోన్లను అమెరికా రక్షణ విభాగానికి చెందిన జనరల్ అటామిక్స్ తయారు చేసింది.
గాలిలో 35 గంటలపాటు స్థిరంగా ఉండి శత్రువర్గాలపై పర్యవేక్షణ, నిఘా, రహస్య సమాచార సేకరణ తదితర కీలకమైన విధులను నిర్వర్తిస్తాయి. క్షణాల్లో శత్రులక్షాలను నాశనం చేస్తాయి. చాలా ఎత్తు నుంచి నిఘా కార్యకలాపాలు సుదీర్ఘకాలం నిర్వర్తించే సామర్ధం కలిగిన ఈ ప్రిడేటర్ బి డ్రోన్లు మానవ ప్రమేయం లేని శత్రునాశన ఆయుధాలుగా డిజైన్ చేయబడ్డాయి.
తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనాతో ప్రతిష్ఠంభన ఏర్పడిన దగ్గర నుంచి వీటిని సంపాదించుకోవాలన్న లక్షంతో భారత్ ఉంటోంది. గత జూన్‌లో పేలుడు పదార్ధాలతో కూడిన డ్రోన్ల దాడి జమ్ము విమానాశ్రయంపై జరిగిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కేంద్రంగా అక్కడి ఉగ్రవాదులే ఈ డ్రోన్లను ప్రయోగించినట్టు అనుమానాలు ఉన్నాయి.
More Stories
అక్టోబర్ 5 నుంచి భారత్ లో 2023 వన్డే ప్రపంచ కప్
మూడో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
ఆధార్ తో ఓటర్ ఐడీ లింక్ గడువు మరో ఏడాది పెంపు