1947లో ఏం జరిగిందో చెప్పాలి… కంగనా సవాల్ 

1857లో జరిగిన యుద్ధం గురించి తనకు తెలుసని.. కానీ 1947లో ఏం జరిగిందనే దాని గురి తనకు ఎవరైనా చెప్పాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సవాల్ చేశారు. ముక్కుసూటిగా మాట్లాడుతూ తరచూ వివాదాలను ఆహ్వానిస్తూ ఉండే ఆమె బాలీవుడ్ లో `ఫైర్ బ్రాండ్’గా పేరొందారు. అయితే, ఎన్ని వివాదాలు చెలరేగినా తన అభిప్రాయాల పట్ల స్పష్టమైన వైఖరి అవలంభిస్తూ వస్తున్నారు. 
 
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లో భారతదేశానికి “నిజమైన స్వాతంత్య్రం” వచ్చిందని, 1947లో వచ్చిన  స్వాతంత్య్రం బిక్ష వంటిదని అంటూ గత బుధవారం సాయంత్రం ఒక వార్తా ఛానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ  రనౌత్ చేసిన వాఖ్యలు దేశంలో పెద్ద దుమారం రేపాయి.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమెకు పద్మశ్రీని ప్రదానం చేసిన రెండు రోజుల తర్వాత ఆమె నుండి ఇటువంటి ప్రకటన రావడంతో పలువురు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా పద్మశ్రీ పురస్కారాన్ని ఆమె  తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

 
అయితే ఆమె తన వాఖ్యలకు  కట్టుబడి ఉంటూ తన ఇంస్టాగ్రామ్ లో వరుసగా పలు ప్రశ్నలను సంధించారు. తన ప్రశ్నలకు ఎవరైనా తనకు సమాధానాలు చెప్పి, 1947 నాటి స్వాతంత్య్రం గురించిన తన సందేహాలను నివృత్తి చేయగలిగితే తాను తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇవ్వడానికి సిద్దమే అని ఈ 37- ఏళ్ళ సంచలన బాలీవుడ్ నటి ప్రకటించారు.

“… జాతీయవాదం అలాగే రైట్‌వింగ్ పెరిగింది… కానీ అది ఆకస్మిక మరణం ఎందుకు? మరి గాంధీ భగత్ సింగ్‌ని ఎందుకు చనిపోనిచ్చారు?  నేతా బోస్ ఎందుకు చనిపోయారు?  గాంధీజీ ఎందుకు ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు? ? శ్వేతజాతీయుడు విభజన రేఖను ఎందుకు గీశాడు… ?స్వాతంత్య్ర వేడుకలకు బదులుగా భారతీయులు ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు?” అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. 

 
తాను కోరుతున్న కొన్ని సమాధానాలకు దయచేసి సమాధానాలు కనుగొనడంలో తనకు సహాయపడమని ఆమె అభ్యర్ధించారు. బ్రిటీష్ వారు భారతదేశాన్ని “సంతృప్త స్థాయికి” దోచుకున్నారని చెబుతూ, “ఐఎన్‌ఎ చేసిన చిన్న పోరాటం” తో అయినా మనకు స్వాతంత్య్రం వచ్చేదని,  బోస్ ప్రధాని అయ్యే అవకాశంఉండేదని  ఆమె పేర్కొన్నారు.

“రైట్‌వింగ్ పోరాడటానికి,  దానిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్  భిక్షాటన గిన్నెలో ఎందుకు స్వాతంత్య్రం ఉంచబడింది? … దయచేసి ఎవరైనా నాకు అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలరా?” అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.

2019లో విడుదలైన తన చిత్రం “మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ” గురించి ప్రస్తావిస్తూ, ఇందులో తాను స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి లక్ష్మీ బాయి పాత్రను పోషించానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తాను 1857 పోరాటంపై విస్తృతమైన పరిశోధన చేశానని ఆమె  చెప్పారు.  ‘సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, వీర్ సావర్కర్ జీ వంటి మహానుభావుల త్యాగాలతో పాటు 1857 మొదటి సామూహిక స్వాతంత్య్ర పోరాటం గురించి తాను  ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతిదీ చాలా స్పష్టంగా చెప్పానని ఆమె పేర్కొన్నారు.

 
ఈ విషయమై చెలరేగిన వివాదాలను, విమర్శలను ప్రస్తావిస్తూ తన ఇంటర్వ్యూలో అన్ని విషయాలను తాను చాలా స్పష్టంగా చెప్పానని తెలిపారు. అయితే కేవలం ఎడిట్ చేసిన వీడియో క్లిప్స్ ను మాత్రమే వైరల్ చేసి తనను విమర్శలకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 

ఆ ఇంటర్వ్యూలో అమరవీరులను తాను అవమానించినట్టు చూపిస్తే పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ఆమె సవాల్ చేశారు. తాను ‘రాణి లక్ష్మీబాయ్’ సినిమా చేశానని,  1857 మొదటి స్వాతంత్య్రం పోరాటంపై అధ్యయనం చేశానని, ఆ సమయంలో తనకు జాతీయవాదం పెరిగిందని ఆమె చెప్పారు.