రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రూ.40 కోట్ల డీల్ జరిగినట్లు, హత్య వెనుక సమీప బంధువులు ఉన్నట్లు వెల్లడవుతుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి మద్దతు తమకు ఉన్నదని సహ నిందితులు చెప్పినట్టు వివేకా మాజీ డ్రైవర్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేయడం కలకలం రేపుతున్నది.
ఈ హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేశారని, బెంగళరులోని భూ వివాదంలో వాటాలు, ఎమ్మెల్సీ ఎన్నికలలో వివేకా ఓటమి నేపథ్యంలో హత్యకు దారితీసినట్లు కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టులో సిఆర్‌పిసి 164(1) సెక్షన్ కింద దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఈ వాంగ్మూల నివేదికను పొందుపరచడంతో ఈ విషయం బయటకు పొక్కింది.
ఎమ్మెల్సీ ఎన్నికలలో గంగిరెడ్డి మోసం చేశారని వివేకా ఆగ్రహం వ్యక్తం చేశారని, దీంతో గంగిరెడ్డి, అవినాష్‌రెడ్డిలను వివేకా స్వయంగా హెచ్చరించాడని కూడా తెలిపాడు. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన భూ వివాదం వాటా ఇవ్వకపోవడంతో గంగిరెడ్డి ఆగ్రహంతో రగిలిపోయినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఎ
మ్మెల్సీ ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత అవినాష్ ఇంటి వద్ద వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని పేర్కొన్నాడు. ఎన్నికలలో మోసం చేయడంపై ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్లు దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు. వివేకా వద్ద తాను డ్రైవర్‌గా పని చేస్తూ 2018లో మానేశానని, ఆ తర్వాత గంగిరెడ్డి తనను ఇంటికి తీసుకువెళ్లి వివేకానందరెడ్డి హత్య పథకం గురించి చెప్పినట్టు పేర్కొన్నాడు. వివేకాను హత్య చేస్తే రూ.5 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని తెలిపాడు.
వివేకా హత్యకు నిందితుడు దస్తగిరి వెనుకాడగా ‘‘నువ్వు ఒక్కడివే కాదు.. మేము కూడా వస్తాము.. దీనివెనుక పెద్దవాళ్లు ఉన్నారు’’ అని యర్ర గంగిరెడ్డి అన్నట్టు నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ‘ఎవరా పెద్దవాళ్లు’ అని తాను అడగ్గా.. ‘వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహరరెడ్డి, డి. శంకరరెడ్డి ఉన్నారు’ అని గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి..మేజిస్ర్టేట్ ఎదుట వెల్లడించాడు.
తనకు ఇస్తానన్న రూ.5 కోట్లలో తొలుత రూ.కోటి ఇవ్వగా, అందులో నుంచి సునీల్ యాదవ్ రూ.25 లక్షలు తిరిగి తీసుకున్నట్లు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా రూ. 75 లక్షలు దాచానని దస్తగిరి తెలిపారు. హత్యకు రెండు రోజుల ముందు సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి కలిసి వివేకా ఇంటి వద్ద కుక్కను చంపేశారని తెలిపాడు.
ఆ తర్వాత వారితో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లామన్నాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్రగంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్లు దస్తగిరి తెలిపారు. తనను చూసిన వివేకా వాళ్లెందుకు వచ్చారని నిర్ఘాంతపోయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడని తెలిపాడు. ఆయన వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.
వివేకా బెడ్ రూమ్‌లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిపాడు. వివేకాను బూతులు తిడుతూ సునీల్ యాదవ్ దాడి చేసినట్టు వెల్లడించాడు. తన చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడి చేశాడని దస్తగిరి తెలిపాడు. ఆ వెంటనే వివేకానందరెడ్డి కిందపడిపోవడంతో అతని ఛాతిపై ఏడెనిమిదిసార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్టు సిబిఐ చార్జిషీట్‌లో పొందుపరిచారు.
More Stories
రతన్ టాటా మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం
ఆలయాల సొమ్ము సగం రేవంత్ ప్రభుత్వ ఖజానాకే
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత