కాలుష్యం కోరల్లో ఢిల్లీ… వారంపాటు పాఠశాలలు మూసివేత

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొంటున్న దేశ రాజధాని ఢిల్లీ కొద్దిరోజులుగా కాలుష్యం కోరల్లో విలవిలలాడుతోంది. దానితో వారం రోజుల పాటు ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తూ, ప్రభుత్వ  ఉద్యోగులు సహితం ఇంటినుండి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

వాతావరణ పరిస్థితులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు పాఠశాలలను ప్రత్యక్ష తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలకు ఇబ్బందుల్లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

అలాగే ఈ నెల 14-17 తేదీల మధ్య నిర్మాణ కార్యకలాపాలకు అనుమతించబోమని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వీలైనంత వరకు వర్క్‌ఫ్రం హోం విధానంలో పని చేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో ఒక వారంపాటు వర్క్‌ఫ్రం హోం విధానంలో పని చేస్తాయని వెల్లడించారు. 

 ప్రైవేటు కార్యాలయాలు ఉద్యోగులకు సైతం వీలైనంత వరకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని ఆయన సూచించారు. ఢిల్లీలో రెండు రోజులు లాక్‌డౌన్‌ పెట్టాలనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో చర్చించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

  మరోవంక,”జనం ఎలా బతకాలి? రెండ్రోజుల లాక్‌డౌన్ విధించడం కానీ, ఇంకేదైనా ఆలోచన కానీ చేస్తున్నారా? తక్షణం చర్యలు తీసుకోండి?”. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.   ప్రజలు ఇళ్లల్లో కూడా మాస్క్‌లు ధరించాల్సి వస్తోందంటే వాయు కాలుష్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతోందని పేర్కొన్నారు. 

ఇది మామూలు సమస్య కాదని చెబుతూ ఢిల్లీలోని వాయికాలుష్యానికి సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏమి చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ”చిన్న పిల్లలు కూడా వాయుకాలుష్యంలోనే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి వాతావరణానికి వారిని విడిచిపెడుతున్నాం. డాక్టర్ గులేరియా (ఎయిమ్స్ చీఫ్) సైతం పిల్లల్ని కాలుష్యం బారిన, డెంగ్యూ వంటి మహమ్మారిల బారిన పడేస్తున్నామని చెబుతున్నారు” అని గుర్తు చేశారు.

“వాయు నాణ్యతను సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు. ఏఐక్యూ‌ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్)ను 500 నుంచి 200 పాయింట్లకు ఎలా తగ్గిస్తారు?. తక్షణ చర్యలు కొన్నైనా తీసుకోండి. రెండు రోజుల లాక్‌డౌన్ విధించే ఆలోచన కానీ, మరేదైనా కానీ మీకు ఉందా? జనం ఎలా జీవించాలి?” అని కోర్టు నిలదీసింది.

“పంట వ్యర్థాలను తగులబెట్టేందుకు 2 లక్షల మిషన్లు అందుబాటులో ఉండగా, మార్కెట్‌లో రెండు మూడు రకాల మిషన్లు ఉన్నాయని, కానీ  రైతులు అంత ఖర్చుతో కొనుగోలు చేయగలిగిన పరిస్థితుల్లో లేరని కోర్టు పేర్కొంది. ఈ మిషన్లను కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ  రైతులకు ఎందుకు సమకూర్చలేదు?” అని కోర్టు ప్రశ్నించింది.