మహారాష్ట్ర ఎన్‌కౌంటర్ లో 26 మంది మావోల హతం

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించారు. ముంబైకి 920 కిలోమీటర్ల దూరంలో ఉండే కొట్గూల్‌గ్యారాపట్టి అటవీ ప్రాంతంలోని ధనోరా వద్ద ఈ ఘటన జరిగింది. నాగపూర్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమై 10 గంటల పాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్ గడ్చిరోలి చరిత్రలో సుదీర్ఘంగా జరిగినదని చెబుతున్నారు.

మృతులలో సీపీఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తెల్తుంబ్డే కూడా ఉన్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. అయితే   ప్రస్తుతానికి ఇది పుకార్లు మాత్రమేనని గడ్చిరోలి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ గోయల్ తెలిపారు. అన్ని మృతదేహాలను గుర్తించిన తర్వాత ఆదివారం మాత్రమే ఖచ్చితంగా చెప్పగలమని పేర్కొన్నారు.

మృతుల్లో మిలింద్ ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు కొద్ది రోజుల క్రితం లొంగిపోయిన తెల్తుంబ్డే మాజీ అంగరక్షకుడు రాకేష్‌ను పోలీసులు తీసుకెళ్లారు. భీమా-కోరెగావ్ కేసుకు సంబంధించి అరెస్టయిన దళిత మేధావి ఆనంద్ తెల్తుంబ్డేకి తెల్తుంబ్డే తమ్ముడు. సీపీఐ(మావోయిస్ట్‌)కి చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ జోన్‌ ఇన్‌చార్జి కూడా.

గడ్చిరోలి జిల్లాకు చెందిన యాంటీ మావోయిస్టు స్క్వాడ్‌కు చెందిన సీ-60 ఫోర్స్ జవాన్లు అదనపు ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో గస్తీ విధులు నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, వెంటనే జవాన్లు ప్రతిస్పందించారని తెలిపారు. ఈ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్ లలో ఇది రెండవ పెద్దది.

 ఏప్రిల్ 23, 2018న గడ్చిరోలి పోలీసులు రెండు వేర్వేరు ఎదురుకాల్పుల్లో 40 మంది మావోయిస్టులను హతమార్చారు. ఎటపల్లి తహసీల్‌లోని బోరియా-కస్నాసూర్ ప్రాంతంలో 34 మంది మృతి చెందగా, అహేరి తహసీల్‌లో పరారీలో ఉన్న అదే గ్రూపుకు చెందిన ఆరుగురు తుపాకీతో కాల్చి చంపారు. 

సంఘటన స్థలానికి అదనపు పోలీసు బలగాలను పంపించినట్లు ఎస్పీ గోయల్  తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించారని,  మర్డింటొల అడవిలో గాలింపు జరుపుతున్నామని తెలిపారు. మృతదేహాలను గడ్చిరోలి తరలించి, పోస్ట్‌మార్టంకు పంపిస్తామని తెలిపారు.

సంఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. చికిత్స కోసం వీరిని హెలికాప్టర్ ద్వారా నాగపూర్ తరలించినట్లు చెప్పారు. ఈ నక్సల్స్ ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి గడ్చిరోలి ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం అందడంతోనే తాము కమాండో దళాన్ని అప్రమత్తం చేసినట్లు, వారు కీకారణ్యంలో గాలిస్తూ ఉండగా ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఎస్‌పి వివరించారు.