ప్రతిపక్షాలన్నీ కలిసినా యుపిలో బిజెపిని ఓడించలేరు 

ఉత్తర ప్రదేశ్ లో వచ్చే ఏడాది మొదట్లో జరిగే ఎన్నికలలో ప్రతిపక్షాలన్నీ కలిసినా, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ కలిసి పోటీచేసిన బిజెపిని ఓడింపలేరని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అమిత్ షా వారణాసిలో 403 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా, ప్రాంతీయ విభాగాల నాయకులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్థాగత కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

పార్టీ వర్గాల కధనం ప్రకారం కరోనా మాహమ్మారి సమయంలో ఆరోగ్య సేవలు,  శాంతిభద్రతలు, మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడంపై  నిర్వహణపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని షా ప్రశంసించారు. ప్రతి ప్రభుత్వం అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా, ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికార మూడ్ చాలా బలంగా ఉందని చెప్పారు.

2022 యూపీ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికలకు కీలకం కానున్నాయని అమిత్ షా స్పష్టం చేస్తూ ఢిల్లీలో విజయం సాధించే మార్గం ఈ రాష్ట్రం గుండా వెళుతున్నందున అందరి దృష్టి యూపీపైనే ఉందని పేర్కొన్నారు. 2017లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయని గుర్తు చేస్తూ ఈ సారి కూడా భారీ విజయానికి కృషి చేయాలని ఆయన పార్టీ నేతలకు మార్గదర్శనం చేశారు.

“అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని – ముఖ్యంగా బూత్ స్థాయిలో – సంస్థాగత బలోపేతంపై సమావేశం దృష్టి సారించింది. ప్రతి బూత్‌లో 100 మంది కొత్త సభ్యులను నమోదు చేసుకోవాలని, అలాగే మొదటిసారి ఓటర్లతో కనెక్ట్ అవ్వాలని మమ్మల్ని కోరారు” అని పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.

షా కొంతమంది నియోజకవర్గ ఇన్‌చార్జులతో సంభాషించారని,  సంస్థాగత పనిపై వారి అభిప్రాయాలను కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యకర్తలందరికీ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర నాయకులను కోరారు. ఎన్నికలు ఇంకా ప్రకటించాల్సి ఉండగా, తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పనులు ఇప్పటి నుంచే  ప్రారంభించాలని ఇన్‌చార్జులకు మార్గదర్శనం చేశారు.

మహ్మద్ అలీ జిన్నాపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను ప్రస్తావిస్తూ జిన్నాను సర్దార్ పటేల్‌తో పోల్చడం ద్వారా అఖిలేష్ చిత్తశుద్ధి లిపించినట్లు వెల్లడైనదని అమిత్ షా ధ్వజమెత్తారు. బీఎస్పీ, కాంగ్రెస్ బలహీనంగా ఉన్నాయని, మూడు పార్టీలు కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సమావేశానికి హాజరైన వారు “బూత్ జీతా, తో యూపీ జీతా (బూత్ గెలిస్తే యూపీ గెలిచినట్లే)” అని ప్రతిజ్ఞ చేయాలని షా కోరారు. “300+ సీట్లు గెలుచుకునే వ్యూహంపై చర్చించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. బిజెపి తన కార్యకర్తల బలం, ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో గెలుస్తుంది” అంటూ అమిత్ షా భరోసా వ్యక్తం చేసిన్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు.