మన భూభాగంలో చైనా గ్రామాలు అవాస్తవం

భారత భూభాగాన్ని  చైనా ఆక్రమించుకుని గ్రామాలను నిర్మిస్తున్నట్లు వచ్చిన వార్తలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తోసిపుచ్చారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత దేశం అవగాహనకు వ్యతిరేకంగా ఎటువంటి అతిక్రమణలు ఇప్పటి వరకు జరగలేదని స్పష్టం చేశారు. 
 
భారత దేశం వైపు గ్రామాల నిర్మాణం కోసం చైనా దళాలు వచ్చినట్లు వెలువడుతున్న కథనాలపై వివాదం రేగిన నేపథ్యంలో ఈ కథనాలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. అయితే గ్రామాలు ఉన్నప్పటికీ, అవి ఎల్ఏసీ నుంచి చైనా వైపు ఉన్నాయని తెలిపారు. భారత్-చైనా మధ్య ఇటీవలి ఘర్షణల నేపథ్యంలో భవిష్యత్తులో ప్రజలను కానీ, సైన్యాన్ని కానీ ఎల్ఏసీ వద్దకు చేర్చాలనేది చైనా వ్యూహం అయి ఉండవచ్చునని ఓ మీడియా కాంక్లేవ్‌లో మాట్లాడుతూ వివరించారు. 

ఇటీవల అమెరికన్ కాంగ్రెస్‌కు ఆ దేశ రక్షణ శాఖ పెంటగాన్ సమర్పించిన నివేదికలో భారత్-చైనా వివాదాస్పద భూభాగంలో గ్రామాలను చైనా నిర్మిస్తోందని పేర్కొన్న సంగతి తెలిసిందే. టిబెట్ అటానమస్ రీజియన్, అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఈ గ్రామాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సీడీఎస్ జనరల్ రావత్ వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యం ఉంది. 

చైనా ఆక్రమణలను అంగీకరించేది లేదు 

కాగా,  పెంటగాన్ నివేదికపై భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ చైనా చట్టవిరుద్ధ ఆక్రమణను, అన్యాయమైన వాదనను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. భారత్-చైనా సరిహద్దుల్లో వివాదంలో ఉన్న భూభాగంలో 100 ఇళ్లతో ఓ గ్రామాన్ని చైనా నిర్మించినట్లు చెప్తున్న పెంటగాన్ నివేదికను గమనించినట్లు భారత ప్రభుత్వం తెలిపింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విడుదల చేసిన ప్రకటనలో భారత్-చైనా సరిహద్దుల్లో ఈస్టర్న్ సెక్టర్‌లో చైనా చేపట్టిన ఓ భారీ గ్రామ నిర్మాణ కార్యకలాపాల గురించి ఈ నివేదిక పేర్కొందని తెలిపారు. తమ భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని భారత దేశం అంగీకరించబోదని స్పష్టం చేశారు. 

చైనా చేస్తున్న అన్యాయమైన వాదనలను భారత్ ఆమోదించలేదని కూడా పేర్కొన్నారు. ఇటువంటి కార్యకలాపాలపై భారత దేశం దౌత్య మార్గాల్లో తీవ్ర నిరసన తెలుపుతోందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నిరసనను తెలుపుతామని పేర్కొన్నారు. 

చైనా అనేక దశాబ్దాల క్రితం చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగంతోపాటు సరిహద్దుల వెంబడి గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాణ కార్యకలాపాలు జరుపుతోందని తెలిపారు. భారత దేశ భూభాగాన్ని ఈ విధంగా అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని భారత ప్రభుత్వం ఎన్నడూ అంగీకరించలేదని గుర్తు చేశారు. 

ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. దేశ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భారత ప్రభుత్వం భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగాన్ని పెంచినట్లు తెలిపారు. 

రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు కూడా ఇవి ఉపయోగపడతాయని వివరించారు.  వాస్తవాధీన రేఖ వెంబడి భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్-టిబెట్ అటానమస్ రీజియన్ మధ్య చైనా ఓ భారీ గ్రామాన్ని నిర్మిస్తోందని పెంటగాన్ నివేదిక పేర్కొంది. దాదాపు 100 ఇళ్ళను ఇక్కడ నిర్మించిందని తెలిపింది.